TG: పీజీ మెడికల్ ఫీజులపై రేపు విచారణ
తెలంగాణలో మెడికల్ పీజీ సీట్ల ఫీజుల విషయమై సోమవారం హైకోర్టులో విచారణ జరుగనుంది. 2023-26 బ్లాక్ పీరియడ్‌కు పీజీ సీటు ఫీజును తెలంగాణ ప్రభుత్వం అనూహ్యంగా పెంచింది. కన్వీనర్ కేటగిరి అయితే రూ. 3.2 లక్షల నుంచి రూ. 7.75 లక్షలకు, మేనేజ్మెంట్ కేటగిరి ఫీజును రూ. 5.8 లక్షల నుంచి రూ. 24 లక్షలకు పెంచింది. దీంతో పీజీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా 60 శాతం ఫీజులు కట్టమని విద్యార్థులకు ఆదేశించి. విచారణను కోర్టు వాయిదా వేసింది. ఆ ఈనెల 1వ తేదీన ఈ కేసు మళ్ళీ కోర్టు ముందు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా TAFRC రెండు కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేసింది. రెండు కేటగిరీల ఫీజులను సమగ్రంగా సమీక్షిస్తామని హైకోర్టుకు హామి ఇచ్చింది. ఒకవేళ ఫీజులను తగ్గిస్తే… ఇప్పటికే కట్టిన ఫీజులకు అడ్జస్ట్ చేస్తామని హామి ఇచ్చింది. ద్రవ్యోల్బణం, డెవలప్మెంట్ వ్యయంతో పాటు వాస్తవానికి ఎంత ఖర్చుల ఉంటాయని తాను మదింపు వేస్తానని TAFRC పేర్కొంది. అవసరమైతే కాలేజీ రికార్డులను పరిశీలిస్తామని పేర్కొంది. గతంలో ఫీజులు పెంచాలని కోరిన ప్రైవేట్ కాలేజీ తాజా విచారణ సందర్భంగా తాము ప్రస్తుత ఫీజులను తీసుకుంటామని ప్రైవేట్ కాలేజీలు కోర్టుకు హామి ఇచ్చాయి. దీంతో కాలేజీ అకౌంట్లను పరిశీలించరాదని నిర్ణయించారు. ఈ కేసు రేపు అంటే సెప్టెంబర్ 7వ తేదీన విచారణకు రానుంది.
ఏపీలో రూ.11.42 లక్షలు
ఇపుడు ఏపీలో నిర్ణయించిన ఫీజులు మెడికల్ విద్యార్థుల్లో హాట్ టాపిక్‌గా మారాయి. డెంటల్, మెడికల్ పీజీ కాలేజీల ఫీజులను 15 శాతం పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆగస్టు 29న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ప్రకారం మెడికల్ పీజీ సీటు ఏ కేటగిరి ఫీజు రూ. 5.71 లక్షలకు, బీ కేటగిరి ఫీజు రూ. 11.42 లక్షలకు ఏపీ ప్రభుత్వం పెంచింది. అలాగే ప్రి క్లినికల్ పీజీ డిగ్రీకి ఫీజు ఏ కేటగిరికి రూ. 80వేలు, బీ కేటగిరి అంటే మేనేజ్మెంట్ కోటాకు రూ. 1.61లకు చేసింది. ఇక పారా క్లినికల్ డిగ్రీ, డిప్లొమోలకు కన్వీనర్ కోటా అయితే రూ. 1.78 లక్షలకు, మేనేజ్మెంట్ కోటా ఫీజు రూ. 3.57లక్షలకు పెంచింది. ఇక డెంటల్ కోర్సులకు పీజీ సీటు ఫీజు కన్వీనర్ కోటాకు రూ. 3.92 లక్షలు, మేనేజ్మెంట్ కోటా అయితే రూ. 7.85 లక్షలు చేసింది. ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే స్థాయిలో అంటే 15 శాతం మేరకు ఫీజులు పెంచే అవకాశముందని తెలుస్తోంది. ప్రైవేట్ కాలేజీలు తమ అకౌంట్ల పరిశీలన వరకు వ్యవహారం రాకూడదని, ఈ మాత్రం ఫీజుల పెంపుకు ఆమోదించాలని భావిస్తున్నట్లు సమాచారం.
