జెట్ స్పీడుతో తెలంగాణ… చేతులెత్తేసిన ఆంధ్రా
రాష్ట్ర విభజన తరవాత అభివృద్ధిలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా ముందుకు సాగాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక… కేసీఆర్ తెచ్చిన పలు విప్లవాత్మక మార్పుల ఫలితాలు కన్పించాయి. దీంతో ఎక్కడా ఆగకుండా శరవేగంతో ముందుకు సాగుతోంది తెలంగాణ. హైదరాబాద్ కేంద్రంగా సర్వీస్ రంగం, రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం రంగం దూకుడు పెంచాయి. అయితే విభజన తరవాత ఏపీ పూర్తిగా వ్యవసాయ రాష్ట్రంగా మారిపోవడంతో…క్రమంగా రాష్ట్ర జీడీపీ పడుతూ వచ్చింది. తలసరి ఆదాయంలో ఏపీని దాటి తెలంగాణ చాలా ముందుకు సాగిపోయింది. ప్రస్తుత ధరల వద్ద లెక్కిస్తే ఏపీ తలసరి ఆదాయం రూ. 1,70,215 కాగా, తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,37,632కు చేరింది. జగన్ అధికారంలోకి రాకముందు రెండు రాష్ట్రాల జీడీపీలు పోటా పోటీగా పెరిగాయి. 2015-16లో ఏపీ 15.1 శాతం, తెలంగాణ 14.2 శాతం చొప్పున అభివృద్ధి సాధించాయి. 2016-17లో కూడా రెండు రాష్ట్రాల మధ్య తేడా కేవలం 0.6 శాతమే. ఏపీ జీడీపీ 13.3 శాతం వృద్ధి సాధిస్తే, తెలంగాణ 13.9 శాతంతో ముందుంది. మరుసటి సంవత్సరంలో తెలంగాణ 13.9 శాతానికి పరిమితం కాగా, ఏపీ 14.9 శాతానికి చేరింది. జగన్ వచ్చిన తొలి ఏడాదిలో 11.5 శాతంతో తెలంగాణ కన్నా (11.3 శాతం) కాస్త ముందున్నా… ఆ తరువాతి ఏడాది దెబ్బతింది. ఏపీ జీడీపీ వృద్ధి రేటు 1.6 శాతానికి పరిమితం కాగా, తెలంగాణ 2.4 శాతంతో ముందుకు సాగింది. దీంతో ఆరేళ్ళ సగటులో ఏపీని తెలంగాణ దాటిపోయింది.
వ్యవసాయం దూకుడు…
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరవాత వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో అనూహ్య అభివృద్ధి నమోదు చేసుకుంది. ఈ రంగం అభివృద్ధి 2 శాతం నుంచి 16.5 శాతానికి చేరింది. గత ఏడాది ఏకంగా 25.6 శాతం నమోదు చేసింది. 2014-15లో తెలంగాణ పండిన వరి ధాన్యం విలువ రూ. 9,528 కోట్లు కాగా, 2020-21లో రూ. 47,440 కోట్లకు చేరింది. ఇక పత్తి పంట విలువ కూడా రూ. 7,549 కోట్ల నుంచి రూ.19,025 కోట్లకు పరుగులు పెట్టింది. ఇక కంది పంట విలువ రూ. 530 కోట్ల నుంచి రూ. 3,808 కోట్లకు చేరింది. అలా అన్ని రకాల పంటల విలువ రూ. 41,706 కోట్ల నుంచి రూ. 80,574 కోట్లకు చేరింది. వ్యవసాయం, పశు సంపద, అటవీ సంపద, మత్స్య సంపదను పరిగణనలోకి తీసుకుంటే వీటి విలువ రూ. 76,123 కోట్ల నుంచి రూ. 1,84,321 కోట్లకు చేరింది. అంటే దాదాపు 142 శాతం అభివృద్ధి నమోదు చేసిందన్నమాట.