For Money

Business News

టాటా స్టీల్‌ … అంచనాలు తప్పాయి

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టాటా స్టీల్‌ కంపెనీ నిరుత్సాహకర పనితీరు కనబర్చింది. ఈ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెట్​ నికర లాభం రూ. 1,514కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలోని నికర లాభం రూ. 11,918కోట్లతో పోలిస్తే 87శాతం తక్కువ. నికరలాభం భారీగా క్షీణించినా.. కంపెనీ ఆదాయం స్థిరంగా ఉంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టాటా స్టీల్​ నికర లాభం రూ. 7,764.96కోట్లుగా ఉంది. మూడు నెలల క్రితం నికర లాభంతో పోలిస్తే ఈసారి నికరలాభం 80శాతం తగ్గింది. జులై- సెప్టెంబర్​ త్రైమాసికంలో టాటా స్టీల్​ ఆదాయం మాత్రం కేవలం 0.8శాతం తగ్గి రూ. 59,877.52 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 60,387.13కోట్లు. టాటా స్టీల్​ కన్సాలిడేటెడ్​ నికర లాభం రూ. 3000కోట్లు, ఆదాయం రూ. 56,900కోట్లుగా ఉంటుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేశారు. తాజా ఫలితాలు నికర లాభం విషయంలో అంచనాలను తప్పాయి. ఇవాళ సమావేశమైన టాటా స్టీల్​ బోర్డు.. 7 లిస్టెడ్​, అన్​లిస్టెడ్​ కంపెనీలను సంస్థలో విలీనం చేసే ప్రతిపాదనను ఆమోదించింది. మరోవైపు ఇవాళ టాటా స్టీల్​ షేర్​ ధర దాదాపు స్థిరంగా రూ. 101.10 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే షేర్‌ ధర 0.49శాతం నష్టపోయింది.