మళ్ళీ రూ. 5006 కోట్ల నష్టం…!
ప్రతి క్వార్టర్లో వేల కోట్ల నష్టం ప్రకటించడం టాటా మోటార్స్‌కు చాలా సాధారణంగా మారింది. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 1299 కోట్ల నష్టం ప్రకటిస్తుంని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేయగా, కంపెనీ ఏకంగా రూ. 5006 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 4450 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.అయితే కంపెనీ టర్నోవర్ మాత్రం 8 శాతం పెరిగి రూ. 66406 కోట్ల నుంచి రూ. 71934 కోట్లకు చేరింది. మున్ముందు కూడా డిమాండ్ బాగుంటుందని… సెమి కండక్టర్స్ చిప్ కొరత తగ్గే అవకాశముందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. భారీగా రుణాలు తీసుకోవడం వల్ల వడ్డీ వ్యయం రూ. 217 కోట్ల నుంచి రూ. 2421 కోట్లకు చేరినట్లు టాటా మోటార్స్ పేర్కొంది. జేఎల్ఆర్ అమ్మకాలు బాగా తగ్గడమే ఫలితాలు నిరుత్సాహం ఉండానికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఈ త్రైమాసికంలో 78825 వాహనాలను జాగ్వర్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) అమ్మింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో జేఎల్ఆర్ అమ్మకాల కంటే ఇది 37 శాతం తక్కువ. సెమి కండక్టర్స్ కొరత కారణంగా జేఎల్ఆర్ అమ్మకాలు తగ్గాయని టాటా మోటార్స్ పేర్కొంది. ఇక దేశీయ మార్కెట్లో కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు 107 శాతం పెరిగాయని తెలిపింది. ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు కూడా 122 శాతం పెరిగినట్లు వెల్లడించింది.