చక్కెర షేర్ల పరుగు
ఎథనాల్ తయారీకి సంబంధించి కేంద్రం ఇది వరకు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుంది. పాత నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దీంతో ఇటీవల భారీగా నష్టపోయిన చక్కెర కంపెనీల షేర్లు ఇవాళ భారీ లాభాలు గడించాయి. ఎథనాల్ తయారీకి చెరకు రసంతో పాటు బీ హెవీ మొలాసిన్ ఉపయోగించవచ్చని కేంద్రం తాజాగా ప్రకటించింది. దీంతో అనేక చక్కెర షేర్లు 8 శాతం దాకా పెరిగాయి. ముఖ్యంగా బలరాంపూర్ చినీ, శ్రీ రేణుక, దాల్మియా భారత్ షేర్లు 8 శాతం దాకా లాభపడ్డాయి. అలాగే త్రివేణి ఇంజినీరింగ్, ఈఐడీ ప్యారీ షేర్లతో పాటు బజాజ్ హిందుస్థాన్ కూడా 5 నుంచి 6 శాతంపైగా లాభపడ్డాయి. ఎథనాల్కు సంబంధించి ఈ నెల 6న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులతో బలరామ్పూర్ చినీ షేర్ 18 శాతం దాకా నష్టపోగా, దాల్మియా భారత్ సుగర్ షేర్ 11 శాతం పడింది. త్రివేణి ఇంజినీరింగ్ కూడా 12 శాతం నష్టపోయింది. ఒకవైపు చెరకు దిగుబడి తగ్గుతున్న నేపథ్యంలో చక్కెర సరఫరా కోసం కేంద్రం కొత్త నిబంధనలు తెచ్చింది. అయితే చక్కెర లాబీకి తలొగ్గిన కేంద్రం… కొత్త నిబంధనలను దాదాపు వెనక్కి తీసుకుంది. మరి చక్కెర షేర్లలో ఈ ర్యాలీ ఎంత వరుకు సాగుతుందో చూడాలి మరి.