For Money

Business News

బుల్‌రన్‌కు బ్రేక్‌

వరుస లాభాలతో హోరెత్తించిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఇవాళ బుల్‌ రన్‌కు బ్రేకిచ్చాయి. సెమీ ఫైనల్స్‌ అసెంబ్లీ ఎన్నికలు, ఫెడ్‌ వడ్డీ రేట్ల నిర్ణయంతో పరుగులు పెట్టిన నిఫ్టి ఇవాళ నష్టాలతో ముగిసింది. అధిక స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడం, అంతర్జాతీయ మార్కెట్లు డల్‌గా మారడంతో సూచీలు చల్లబడ్డాయి. నిఫ్టీ 21,434 దగ్గర ప్రారంభమై ఒకదశలో 21,365కు చేరినా… చివర్లో స్వల్పంగా కోలుకుని 38 పాయింట్లు కుంగి 21,418 వద్ద ముగిసింది. ఇక
సెన్సెక్స్‌ కూడా 168.66 పాయింట్ల నష్టంతో 71,315 క్లోజైంది. సన్‌ఫార్మా, రిలయన్స్, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్‌, హెచ్‌యూఎల్‌, మారుతీ, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వంటి ప్రధాన షేర్లు లాభాలతో క్లోజ్‌ కాగా, పవర్‌గ్రిడ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్‌ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా బ్యాంకు షేర్లలో వచ్చిన ఒత్తిడి నిఫ్టిని దెబ్బతీసింది. ఫైనాన్షియల్స్‌ షేర్లు నష్టాలతో ముగిశాయి. మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ దాదాపు నిన్నటి ముగింపు వద్దే ముగిసినా… నిఫ్టి నెక్ట్స్‌ మాత్రం 0.66 శాతం లాభంతో క్లోజ్‌ కావడం విశేషం. ఐఆర్‌సీటీసీ, సీమెన్స్‌, జైడస్‌ లైఫ్‌, జొమాటో, వీబీఎల్‌ వంటి షేర్లు భారీ లాభాలతో క్లోజ్‌ కావడమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా ఐఆర్‌సీటీసీ ఏకంగా 12 శాతం లాభంతో క్లోజింది. కొన్ని అదానీ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారు.