ఎయిర్పోర్ట్ మెట్రో: బిడ్స్‌కు ఆహ్వానం
రాయదుర్గం నుంచి షంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు వేస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం జనరల్ కన్సల్టెంట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు అమలు కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) పేరుతో 2018 ఏప్రిల్ 11వ తేదీనే ఏర్పాటు చేసింది. తొలుత ఈ ప్రాజెక్టులో హైదరాబాద్ మెట్రోకు 51 శాతం, మిగిలిన 49 శాతం వాటా హెచ్ఎండీఏకు ఉండేలా నిర్ణయించారు. కాని ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా నిర్వహించనుంది. అందుకే దీని కోసం ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేసింది. మొత్తం ఈక్విటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండనుంది. సుమారు రూ. 6250 కోట్ల వ్యయంతో దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే ఈ మార్గంలో ప్రయాణించేవారిలో అత్యధిక శాతం మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విమాన ప్రయాణీకులు ఉంటారు కాబట్టి… ఈ ప్రాజెక్టు వెంటనే లాభదాయకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కన్సల్టెంట్ నియామకం తరవాత నిర్మాణం కోసం బిడ్లు ఆహ్వానించే అవకాశముంది.
మేము బిడ్ వేస్తాం…
ఎయిర్ పోర్ట్ మెట్రో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించే బిడ్లలో తాము కూడా పాల్గొంటామని ఎల్ అండ్ టీకి చెందిన అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇపుడున్న హైదరాబాద్ మెట్రోలో వాటా తీసుకున్నట్లు .. ఎయిర్పోర్ట్ మెట్రోలో వాటా తీసుకోవడం లేదని అన్నారు. తాము కేవలం ఓ కాంట్రాక్టర్‌గా బిడ్ వేస్తామని… ఎంపికైతే తమ బాధ్యత మెట్రోనిర్మాణం వరకేనని అన్నారు. నిర్మాణ ప్రక్రియ సమయానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కంపెనీకి భాగస్వామ్యం ఇస్తుందేమో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం వంద శాతం తన నిధులతోనే నిర్మించాలని భావిస్తోంది. (file photo)