లాభాల్లో SGX NIFTY
రాత్రి అమెరికా మార్కెట్లు చాలా చిత్రంగా ప్రవర్తించాయి. నిన్న వచ్చిన వినియోగదారుల సూచీ అనుకున్న దానికన్నా తక్కువ స్థాయిలో పెరగడంతో ఈక్విటీ మార్కెట్లు ఉవ్వెత్తున లేచాయి. డౌజోన్స్ ఏకంగా 2.7 శాతం పెరిగింది. ఎంత జోరుగా పెరిగాయో… ముగిసే సమయానికి అంతే స్పీడుతో వెనక్కి తగ్గాయి. ఒక్క నాస్డాక్ మాత్రమే ఒక శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 సూచీ 0.73 శాతం పెరగ్గా, డౌజోన్స్ కేవలం 0.3 శాతం లాభంతో ముగిసింది. దీనికి ప్రధాన కారణం ఇవాళ ఫెడ్ మీటింగ్. వడ్డీ రేట్లను ఇవాళ ఫెడ్ పెంచనుంది. అంతకుముందు యూరప్ మార్కెట్ భారీ లాభాలతో ముగిశాయి. పలు సూచీలు ఒక శాతంపైగా లాభంతో ముగిశాయి. అయితే వాల్‌స్ట్రీట్ లాభాల స్వీకరణ ప్రభావం ఇవాళ కన్పించనుంది. ఇక ఆసియా మార్కెట్ల విషయానికొస్తే .. మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.72 శాతం, తైవాన్ 1 శాతతం, హాంగ్‌సెంగ్ 0.56 శాతం పెరిగాయి. చైనా మార్కెట్లు నష్టాల్లో ఉన్నా.. నామమాత్రంగా ఉన్నాయి. ఇక సింగపూర్ నిఫ్టి 85 పాయింట్ల లాభంతో ఉంది. సో… నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభం కానుంది. బ్యాంక్ నిఫ్టి 44000 మార్క్‌ను దాటనుంది.