రూ. 4389 కోట్ల సుంకం ఎగవేత?
చైనా మొబైల్ కంపెనీ ఒప్పో రూ. 4389 కోట్ల మేరకు కస్టమ్స్ డ్యూటీ ఎగవేతకు పాల్పడినట్లు భారత అధికారులు అనుమానిస్తున్నారు. ఒప్పో భారత్ సబ్సిడరీ ఒప్పో మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో తనిఖీలను చేయగా కంపెనీ రూ 4,389 కోట్లకు పన్ను ఎగవేతలకు పాల్పడిందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజన్స్ (డీఆర్ఐ) గుర్తించింది. ఒప్పో ఇండియా భారత్లో మొబైల్ ఫోన్ల తయారీ, అసెంబ్లింగ్, హోల్సేల్ ట్రేడింగ్, మొబైల్ ఫోన్ల పంపిణీ, యాక్సెసరీస్ల వంటి వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఒప్పో, వివోతో పాటు రియల్మి, వన్ప్లస్, ఐక్యూఓఓలను చైనాకు చెందిన బీబీకే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ప్రమోట్ చేస్తోంది. ఒప్పో కంపెనీ ఐపీఎల్ టర్నోని స్పాన్సర్ చేసిన విషయం తెలిసిందే. ఒప్పో ఇండియా కంపెనీపై తాము జరిపిన దాడుల్లో అనేక అవకతవకలు జరిగినట్లు గుర్తించామని డీఆర్ఐ అధికారులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్ అధికారులు, ఒప్పో ఇండియా దేశీ సరఫరాదారులను డీఆర్ఐ అధికారులు ప్రశ్నించారు. పరికరాల దిగుమతి సమయంలో కస్టమ్స్ అధికారులకు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు అధికారులు విచారణ సమయంలో అంగీకరించారు.