For Money

Business News

మళ్ళీ ధరల దూకుడుhttps://formoney.in/wp-admin/post-new.php

ద్రవ్యోల్బణ కట్టడి కోసం ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు ఫలితం ఇవ్వడం లేదు. కేంద్రం చెబుతున్న గొప్పలు కూడా వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉన్నాయి. రష్యా నుంచి డిస్కౌంట్‌కు ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న ప్రభుత్వం.. బహిరంగ మార్కెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించకుండా… తన ఖజానాను నింపుకుంటోంది. దీంతో ద్రవ్యోల్బణం దిగి రావడం లేదు. ఆరు నూరైనా ద్రవ్యోల్బణ కట్టడికి ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని.. వడ్డీ రేట్లను భారీగా పెంచుతామని అమెరికా కుండలు బద్ధలు కొట్టింది. కాని అబద్ధాలతో మన ప్రభుత్వం కాలం వెళ్ళబుచ్చుతోంది. దీని ప్రజలు ముఖ్యంగా పేదలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది.
వరుసగా మూడు నెలలు తగ్గినట్లే కన్పించిన రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆగస్టు నెలలో ఒక్కసారిగా భగ్గుమంది. ఆహారోత్పత్తుల ధరలు మండిపోవడంతో రీటైల్‌ ద్రవ్యోల్బణం 7 శాతానికి పెరిగింది. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశించిన 6 శాతం ఎగువనే ద్రవ్యోల్బణం రేటు కొనసాగడం ఇది వరుసగా ఎనిమిదో నెల. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూలైలో 6.71 శాతంకాగా, 2021 ఆగస్టులో ఇది 5.3 శాతం. ఆగస్టు నెలలో ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం భారీగా 7.62 శాతం పెరిగింది. 2022 జూలైలో ఈ వృద్ధి రేటు 6.69 శాతంకాగా, నిరుడు ఆగస్టులో 3.11 శాతమేనని ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది. కూరగాయలు, మసాలా దినుసుల ధరల్లో వృద్ధి 10 శాతం దాటాగా, తృణ ధాన్యాలు, పప్పు దినుసుల ధరలు కూడా భారీగా పెరిగాయి.