For Money

Business News

PSU బ్యాంకుల్లో మొత్తం వాటా అమ్మకం?

అనేక ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసి పెద్ద బ్యాంకుల నుంచి తయారు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇపుడు కొత్త ఆలోచన చేస్తోంది. అదేమిటంటే… ప్రభుత్వం బ్యాంకుల్లో వంద శాతం వాటా ప్రైవేట్‌కు అప్పగించేందుకు సవరణలు తెస్తోంది.ఈ మేరకు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో మోడీ ప్రభుత్వం బిల్లు తేనుంది. . The Banking Companies (Acquisition and Transfer of Undertakings) Act, 1970 చట్టం ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వం కనీసం 51 శాతం వాటా ఉండాల్సిందే. దీన్ని 26 శాతానికి తగ్గించాలని మోడీ ప్రభుత్వం తొలుత ఆలోచించింది. అయితే మొత్తం బ్యాంకును ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగించేలా బ్యాంకింగ్‌ చట్టంలో మార్పు తేస్తోంది. వర్షాకాల సమావేశాల్లో ఈ మేరకు బ్యాంకింగ్‌ చట్టానికి సవరణ తేనున్నారు. ఒక్కసారి ఈ చట్టానికి ఆమోదం లభిస్తే ఎస్బీఐ వంటి బ్యాంకును కూడా భవిష్యత్తులో మొత్తం ప్రైవేట్‌ రంగానికి అప్పగించవచ్చు.
ఐడీబీఐ బ్యాంక్‌తో…
ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రక్రియ ఇపుడు జరుగుతోంది. రోడ్‌ షోలు కూడా జరుగుతున్నాయి. ఈ బ్యాంకులో ప్రభుత్వానికి 45.48 శాతం వాటా ఉండగా, ఎల్‌ఐసీకి 49.24 శాతం వాటా ఉంది. ఈ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రభుత్వం ఇప్పటికే ఆసక్తి ఉన్నవారి నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఈ ప్రైవేటీకరణకు సంబంధించి చేసిన రోడ్‌షోలలో పలువురు ఇన్వెస్టర్లు వంద శాతా వాటా ఇస్తే బాగుంటుందని కోరారట. దీంతో ప్రభుత్వం త్వరలో ప్రైటీకరించే బ్యాంకుల్లో మొత్తం వాటాను విక్రయించేందుకు రెడీ అవుతోంది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌ సీస్‌ బ్యాంకులను ప్రైవేటీకరించాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసింది. వర్షాకాల సమావేశాల్లో బ్యాంకింగ్‌ చట్టానికి సవరణ చేయనున్నారు. వంద శాతం ప్రైవేటీకరణ నిబంధన ఈ సవరణ చట్టంలో ఉంటుందేమో చూడాలి. ఒకవేళ ఈ చట్టానికి ఆమోదం లభిస్తే… 2024 ఎన్నికల తరవాత మోడీ అధికారంలోకి వస్తే ప్రధాన బ్యాంకుల ప్రైవేటీకరణ కూడా ప్రారంభం అవుతుందన్న చర్చ అపుడే ప్రారంభమైంది.