For Money

Business News

ప్రైవేట్‌ పెట్రోల్‌ బంకులు మూసివేత?

భారీ మొత్తంలో కొనగోళ్ళు చేసేవారికి డీజిల్‌ ధరను లీటరుకు రూ.25 చొప్పున ప్రభుత్వం పెంచింది. బహిరంగ మార్కెట్‌ గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆర్టీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల బదులు బయట మార్కెట్‌లో బంకుల్లో కొంటున్నారు. దీంతో బయట మార్కెట్‌లో డీజిల్‌కు భారీ డిమాండ్‌ పెరిగింది. కాని కేంద్రం నిర్ణయం కారణంగా ప్రైవేట్‌ సంస్థలు తమ పెట్రోల్‌ బంకులను మూసేసే పరిస్థితి తలెత్తుతోంది. గత 139 రోజుల నుంచిప్రభుత్వం ధరలు పెంచలేదు. అసెంబ్లీ ఎన్నికల తరవాత పెంచుతారని భావించగా, ఇప్పటి వరకు పెంచలేదు. ఈలోగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 40 శాతం పెరిగాయి. ఆ ధరతో కొని దేశీయ మార్కెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌ అమ్మితే నష్టం వస్తుందని ప్రైవేట్‌ కంపెనీలు అంటున్నాయి. దీంతో తమ పెట్రోల్‌ బంకుల వద్ద నో స్టాక్‌ బోర్డు పెడుతున్నాయి. మరికొన్ని రోజులు చూసి మూసేస్తారని కూడా ఈ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రీటైల్‌ సేల్స్‌ భారీగా పెరిగినందున… తమ అమ్మకాలు పెరిగేకొద్దీ నష్టాలు పెరుగుతాయని ప్రైవేట్‌ కంపెనీలు అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతుందేమోనని మరికొన్నాళ్ళు ప్రైవేట్ కంపెనీలు వేచి చేసేలా ఉన్నాయి. పరిస్థితి మారకపోతే మూసేయడమే నయమని భావిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే పెట్రోల్‌ పంపులు మూసేసినట్లు తెలుస్తోంది.