డామిట్… అపుడే కథ అడ్డం తిరిగిందే…
ఇలాంటి పరిస్థితి… కేవలం ఏడేళ్ళలోనే వస్తుందని బహుశా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఊహించి ఉండరు. రాష్ట్ర విభజన జరిగితే కరెంటు లేక తెలంగాణ ప్రజలకు చీకటి బతుకులు తప్పవని ఆంధ్రా పాలకులు చేసిన హెచ్చరికలను గుర్తు చేసుకుని తెలంగాణ ప్రాంత ప్రజలు ఇపుడు నవ్వుకుంటున్నారు. ఆర్థికంగా మొదటి రోజు నుంచే మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇవాళ కరెంటులో కూడా మిగులు రాష్ట్రంగా ఉంటూ రోజుకు రెండు కోట్ల యూనిట్ల విద్యుత్తును కనీవినీ ఎరుగని రేట్లకు అమ్ముతోంది. ప్రభుత్వ రంగ సంస్థలను నమ్ముకోవడం, వాటికి పకబడ్బందీ ఏర్పాట్లు చేసుకోవడంతో… మిగులు విద్యుత్తుతో తెలంగాణ మెరిసిపోతోంది. మరోవైపు ఏపీ ప్రజలు తమ ఖర్మకువారే నిందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ ప్రాజెక్టును నిర్మించుకోవడమేగాక.. ఆధునాతన కృష్ణపట్నం పవర్ ప్లాంట్ ప్రైవేట్ నుంచి ప్రభుత్వం చేతికి వచ్చినా… ప్రభుత్వం చేతగానితనానికి జనం మూల్యం చెల్లిస్తున్నారు. ముఖ్యమంత్రికి భజన చేస్తూ… ఆయన ట్వీట్లను ఫార్వర్డ్ చేస్తూ టైమ్ పాస్ చేసిన ఏపీ ఉన్నతాధికారులకు విద్యుత్ ప్లాంట్ల వద్ద కనీసం 20 రోజులు బొగ్గు కచ్చితంగా ఉండాలన్న నిబంధనను కూడా పట్టించుకోలేదు. కనీసం ఆ ప్లాంట్లతో ఒప్పందం కూడా చేసుకోలేదు. తమ వద్ద కావాల్సిన బొగ్గు ఉందని.. బకాయిలు చెల్లించని రాష్ట్రాలకే సరఫరా చేయలేదని బొగ్గు కార్యదర్శి అంటున్నారు. బకాయిలు కూడా చెల్లించలేని స్థితిలో రాష్ట్రం ఉందన్నమాట. అధికారంలోకి వచ్చీరాగానే విద్యుత్ పీపీఏలను అత్యంత వివాదాస్పద అంశంగా మార్చిన ఏపీ ప్రభుత్వం ఇపుడు మూల్యం చెల్లిస్తోంది. ఇప్పటికే అనధికారికంగా గ్రామాల్లో విద్యుత్ కోత అమలవుతోంది. దసరా తరవాత ప్రభుత్వం అధికారికంగా కోత విధించనుంది. నిర్ణయించిన ధర చెల్లిస్తున్నా…పీక్ టైమ్‌లో కరెంటు వాడొద్దని బెదిరించే ప్రభుత్వం అధికారంలో ఉండటానికి కారణాన్ని ప్రజలు ఇపుడు అన్వేషిస్తున్నారు.