For Money

Business News

యూరప్‌లో 22 పెగసస్‌ కాంట్రాక్ట్‌లు

యూరప్‌ దేశాల్లో తమకు 22 కాంట్రాక్టులు ఉన్నట్లు పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ తయారీ సంస్థ ఎన్‌ఎస్‌ఓ వెల్లడించింది. ఇందులో 12 దేశాలతో ఒప్పందం ఉన్నట్లు వెల్లడించింది. పెగసస్‌ నిఘా సాఫ్టవేర్‌ గురించి యూరప్‌ మీడియాలో వార్తలు రావడంతో దీనిపై దర్యాప్తునకు యూరోపియన్‌ పార్లమెంట్‌ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పెగసస్‌ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ కమిటీ ఇటీవల ఇజ్రాయిల్‌ సందర్శించింది. నేరుగా ఎన్‌ఎస్‌ఓ ప్రతినిధులతో మాట్లాడింది. యూరోపియన్‌ యూనియన్‌లో 27 దేశాలకు సభ్యత్వం ఉండగా 12 దేశాలలో తమకు 22 కాంట్రాక్ట్‌లు ఉన్నట్లు ఎన్‌ఎస్‌ఓ అంగీకరించింది. అధికార పార్టీలు ఈ సాఫ్ట్‌వేర్‌ సాయంతో తమ ప్రత్యర్థులతో పాటు ప్రముఖ జర్నలిస్టులు, విపక్ష నేతలు.. చివరికి న్యాయవాదులపై కూడా నిఘా వేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మన దేశంలో కూడా ఇలాంటి ఆరోపణలు రావడం.. కొందరు జర్నలిస్టులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో… కోర్టు కమిటీని వేసింది. తీవ్ర వాదులు, ఇతర తీవ్ర నేరాలు చేసేవారిపై నిఘా వేసేందుకు తాము సాఫ్ట్‌వేర్‌ను అమ్మినట్లు ఎన్ఎస్‌ఓ అంటోంది. అయితే సభ్య దేశాలు కూడా ఈ నిఘా సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసినట్లు వెల్లడి కావడంతో కమిటీ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఈ కమిటీ ప్రతినిధులు పలు మార్లు ఇజ్రాయిల్‌ను సందర్శించారు. ఎన్‌ఎస్‌ఓ ఉద్యోగులతో పాటు ఇజ్రాయిల్‌ రక్షణ విభాగం ప్రతినిధులు, స్థానిక నిపుణులతో కూడా కమిటీ సభ్యులు సంప్రదింపులు జరిపారు.