ఆయిల్ కంపెనీలకు లక్ష కోట్ల లాభం?
అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ధరలు తగ్గినా… దేశీయ మార్కెట్లో ధరలు తగ్గించకపోవడంతో… ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ లాభాల పంట పండుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ తదితర ఉత్పత్తుల అమ్మకాల ద్వారా ఏకంగా లక్ష కోట్ల రూపాయల పన్నుల ముందు లాభాన్ని ఆర్జించనున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ రీసెర్చి సంస్థ క్రిసిల్ వెల్లడించింది. 2017 నుంచి 2022 మధ్య కాలంలో ఏడాదికి రూ.60,000 కోట్ల ఆపరేటింగ్ లాభాలను ఆర్జించిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 2022-23లో కేవలం రూ. 33,000 కోట్ల ఆపరేటింగ్ లాభాలను ఆర్జించినట్లు క్రిసిల్ పేర్కొంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు స్థిరంగా తక్కువ స్థాయిలో ఉన్నా… దేశీయంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదని వెల్లడించింది. ఇదే పరిస్థితి కొనసాగే పక్షంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీలు ఏకంగా లక్ష కోట్ల రూపాయిల ఆపరేటింగ్ లాభాలను ఆర్జించగలవని క్రిసిల్ పేర్కొంది. ఏడాది క్రితం ధరలతో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు 30 శాతం తగ్గిన విషయాన్ని క్రిసిల్ తన నోట్లో వివరించింది. అయినా 2022 నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించలేదని స్పష్టం చేసింది. ఆయిల్ కంపెనీలకు క్రూడ్ ఆయిల్‌ను రిఫైన్ చేయడం ద్వారా లాభాలు వస్తాయని.. అయితే అధిక లాభాలు పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా వస్తాయని క్రిసిల్ వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో క్రూడ్‌ను రిఫైన్ చేయడం ద్వారాఒక్కో బ్యారెల్‌కు 15 డాలర్ల లాభాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పొందాయి. ఇపుడు పెట్రోల్, డీజిల్ అమ్మకం ద్వారా లీటరుకు రూ. 5 నుంచి రూ. 7ల లాభం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు వస్తోంది. మున్ముందు అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ధరలు పెరగడంతో పాటు డాలర్ బలపడే పక్షంలో కంపెనీల ఆపరేటింగ్ మార్జిన్ తగ్గవచ్చని… లేకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో భారీ లాభాలు గడిస్తాయని క్రిసిల్ పేర్కొంది.