EV స్కూటర్ల ఉత్పత్తి నిలిపివేత
ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీని ఓలా సంస్థ తాత్కాలికంగా ఆపేసింది. ప్లాంట్ మెయింటెనెన్స్ కోసం ఉత్పత్తి ఆపినట్లు కంపెనీ అంటున్నా… డిమాండ్ లేకపోవడం వల్లే నిలిపివేశారని మార్కెట్లో వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడులోని హోసూర్ జిల్లా కృష్ణగిరిలో ఓలాకు తయారీ ప్లాంట్ ఉంది. ఇక్కడ దాదాపు 4,000 స్కూటర్లు స్టాక్ ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే వచ్చిన ఆర్డర్ల మేరకు స్కూటర్లను తయారు చేశారని.. ఇంకా మిగిలిన స్కూటర్ల సంఖ్య 4000పైనే అని తెలుస్తోంది. ప్లాంట్ రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం 600 స్కూటర్లు కాగా, ఇప్పుడు కేవలం వంద స్కూటర్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారని తెలుస్తోంది. గత నెల 21 నుంచి వీటి ఉత్పత్తి కూడా నిలిపి వేసినట్లు సమాచారం. వార్షిక మెయింటెనెన్స్, కొత్త యంత్రాల ఇన్స్టలేషన్ కోసం ఉత్పత్తిని ఆపేసినట్లు ఓలా కంపెనీ అంటోంది. అయితే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి, డిమాండ్‌కు సంబంధించిన డేటాను మాత్రం కంపెనీ వెల్లడించడం లేదు. దీంతో కంపెనీ చెబుతున్న కారణాలపై మార్కెట్లో అనుమానాలు పెరుగుతున్నాయి.