ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలకు ‘నామినీ’
ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి కొత్తగా ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించే ఇన్వెస్టర్లు తమకు ఇష్టం ఉంటే నామినీ పేరు కూడా సూచించవచ్చని సెబీ వెల్లడించింది. ఇష్టం లేకపోతే నామినీ పేరు పేర్కొనాల్సిన అవసరం లేదు. ఈ రెండు ఆప్షన్లకు అనుగుణంగా రెండు రకాల దరఖాస్తు ఫారాలను సెబీ సిద్ధం చేసింది. ఈ దరఖాస్తు ఫారాలు లేని కొత్త ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలను యాక్టివేట్ చేయవద్దని బ్రోకర్లు, డిపాజిటరీ సంస్థలను ఆదేశించింది. నామినేషన్, డిక్లరేషన్ ఫారాల మీద ఖాతాదారులు స్వయంగా సంతకాలు చేయాల్సి ఉంటుందని, సాక్షుల సంతకాలు అవసరం లేదని సెబీ స్పష్టం చేసింది.ఒకవేళ ఖాతాదారుడు వేలి ముద్ర వేస్తే మాత్రం సాక్షి సంతకం తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది.. ఈ-సిగ్నేచర్‌తో ఆన్‌లైన్‌లోనూ నామినేషన్, డిక్లరేషన్ ఫారాలు సమర్పించవచ్చు. ఇప్పటికే ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు ఉన్న ఇన్వెస్టర్లు కూడా వచ్చే ఏడాది మార్చి నెలాఖరు లోగా నామినేషన్ కార్యక్రమం పూర్తి చేయాల్సి ఉంటుందని, లేకుంటే వారి ఖాతాలు స్తంభింప చేస్తామని సెబి స్పష్టం చేసింది.