For Money

Business News

క్షీణించిన రిలయన్స్‌ నికరలాభం

గత జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.12,273 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన (రూ.13,233 కోట్లు) లాభంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో 7.25 శాతం తగ్గింది. కంపెనీ ఆదాయం మాత్రం రూ. 91,258 కోట్ల నుంచి రూ. 1.44 లక్షల కోట్లకు పెరిగింది. ఆదాయం ఇంత పెరిగినా లాభాలు తగ్గడానికి కారణం ఖర్చులు పెరగడమే. కంపెనీ పన్నల భారం రూ. 3,464 కోట్లు పెరగడంతో పాటు ఇతర ఖర్చులు రూ. 1.31 లక్షల కోట్లకు చేరాయి.
నిలకడగా జియో…
గత ఏడాదితో పోలిస్తే కంపెనీ పనితీరు కాస్త పరవాలేదని అనిపిస్తున్నా… మార్చితో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ పనితీరులో పెద్ద మార్పులేదు. దీనికి కారణం ఈ త్రైమాసికంలో కరోనా సెకండ్‌ వేవ్‌ రావడమే. త్రైమాసికాలవారీగా చూసుకుంటే క్రితం మూడు నెలలో కంటే ఈసారి రిలయన్స్‌ జియో ఆదాయం కేవలం 4 శాతం పెరగ్గా, ఆదాయం కూడా అంతే పెరిగింది. రూ. 18,952 కోట్ల ఆదాయంపై రూ. 3,651 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఏపీఆర్‌యూలో ఎలాంటి మార్పు లేదు. ఇక రీటైల్‌ విభాగం పనితీరు కూడా అంతంత మాత్రమే ఉంది. సీక్వెన్షియల్‌గా చూస్తే అమ్మకాలు కూడా రూ.41,296 కోట్ల నుంచి రూ. 33,566 కోట్లకు తగ్గింది. ఆపరేటింగ్‌ మార్జిన్‌ రెండు శాతం పెరిగి 5.8 శాతానికి చేరడం విశేషం.