జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో ఎన్‌ఐఐఎఫ్ పెట్టుబడి
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ (జీఏఎల్) చేపట్టిన 3 విమానాశ్రయాల ప్రాజెక్టుల్లో ఎన్‌ఐఐఎఫ్ (నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్) పెట్టుబడి పెట్టనుంది. తొలిదశలో గోవా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో రూ.631 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ మేరకు జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ ఎన్ఐఐఎఫ్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ పెట్టుబడి భాగస్వామ్యం భోగాపురం (విశాఖపట్నం), మహారాష్ట్రలోని నాగ్‌పూర్ విమానాశ్రయాలకూ విస్తరించే అవకాశం ఉందని జీఎంఆర్ పేర్కొంది. గోవా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టుకు ఎన్ ఐఐఎఫ్, కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్ (సీసీడీ) రూపంలో రూ.631 కోట్లు సమకూర్చుతుందని జీఎంఆర్‌గ్రూపు బిజినెస్ ఛైర్మన్ జీబీఎస్ రాజు తెలిపారు. ఈ ప్రాజెక్టును 2016లో జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ దక్కించుకుంది. నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయని ఆయన చెప్పారు. వాణిజ్య కార్యకలాపాల ప్రారంభానికి రెడీగా ఉంది. తొలిదశలో ఈ విమానాశ్రయం నుంచి ఏటా 44 లక్షల మంది రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిస్థాయి విస్తరణ తర్వాత ఏటా 4 కోట్ల మంది రాకపోకలు సాగించే అవకాశం ఉంటుందని రాజు తెలిపారు. ఎన్‌ఐఐఎఫ్‌తో భాగస్వామ్యం గోవా విమానాశ్రయానికే పరిమితం కాకుండా, మరో రెండు విమానాశ్రయాలకు విస్తరిస్తుందని జీబీఎస్ రాజు తెలిపారు.