For Money

Business News

స్వల్ప నష్టాలతో ముగిసిన నిఫ్టి

అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాలు దాదాపు కరిగిపోవడం, యూరో మార్కెట్ల నష్టాలు కూడా చాలా వరకు తగ్గడంతో నిఫ్టి తక్కువ నష్టాలతో బయటపడింది. ఉదయం భారీ నష్టాలతో 17064 పాయింట్లను తాకిన నిఫ్టి… యూరో ఫ్యూచర్స్‌ చూసి కోలుకోవడం ప్రారంభమైంది. పరిమిత నష్టాల నుంచి యూరో ఫ్యూచర్స్‌ చాలా వరకు కోలుకోవడంతో మన మార్కెట్లు నిలబడగలిగాయి. వాస్తవానికి జర్మనీ డాక్స్‌ గ్రీన్‌లోకి వచ్చింది. రెండు గంటల ప్రాంతంలో మరోసారి స్వల్ప మద్దతు అందింది. మొత్తానికి నిఫ్టి 17252 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 62 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టి బ్యాంక్‌ కూడా చాలా స్వల్ప నష్టాలతో ముగిసింది. నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ మాత్రం ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. నిఫ్టిలో యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌లో ముందున్నాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో టాటా మోటార్స్‌ కొనసాగింది. టాటా కన్జూమర్‌, హీరోమోటొ కార్ప్ షేర్లు కూడా రెండు శాతంపైగా నష్టంతో ముగిశాయి. ఇతర షేర్లలో గత కొన్ని రోజులుగా క్రమంగా పేటీఎం పెరుగుతూ వస్తోంది. పలు బ్రోకింగ్‌ సంస్థలు ఈ షేర్‌ టార్గెట్‌ రూ.1000 నుంచి రూ.1200గా పేర్కొంటున్నారు. నిజానికి నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ మిడ్‌ సెషన్‌లో తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఉదయం కంటే ఎక్కువగా నష్టపోయింది. ఈ సూచీలో కేవలం నాలుగు షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. మిగిలిన 21 షర్లు నష్టాల్లో ముగియడం విశేషం. ఇటీవల బాగా పెరిగిన అశోక్‌ లేల్యాండ్‌, ఆస్ట్రాల్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, డిక్షన్‌ షేర్లలో లాభాల స్వీకరణ అధికంగా ఉంది. ఇక బ్యాంక్‌ షేర్లు ఇవాళ మార్కెట్‌ను కాపాడాయని చెప్పాలి. పెరగకపోయినా… స్థిరంగా నిలబడి… నిఫ్టి మరీ బలహీనపడకుండా కాపాడాయి.