For Money

Business News

మార్కెట్‌లో నష్టాల జాతర

ఇప్పటి వరకు ఇలాంటి విశేషణాలు మార్కెట్‌ బాగా పెరిగితే వాడేవారు. ఇపుడు నష్టాలకు కూడా వాడాల్సి వస్తోంది. నిజం చెప్పాలంటే పొజిషనల్‌, ఇన్వెస్టర్లకు నష్టాలే కాని… ట్రేడర్స్‌కు పండగే కదా? మార్కెట్‌ 15,400 కచ్చితంగా తాకుతుందని టెక్నికల్‌ అనలిస్టులు వారం రోజుల నుంచి అంటున్నారు. గత వారం రోజుల నుంచి నిఫ్టి ఏమాత్రం పెరిగినా షార్ట్‌ చేస్తున్నారు. మరి నిన్న షార్ట్‌ చేసినవారికి అంటే కాల్‌ రైటింగ్‌ చేసివారికి ఇవాళ లాభాల జాతరే కదా. షేర్‌ మార్కెట్‌లో 90శాతం ఆప్షన్స్‌ ట్రేడింగే. కాబట్టి ట్రేడర్లకు సూచీలు పెరిగినా లాభాలు.. పడినా లాభాలే. ఆరంభంలో 15,984 తాకిన నిఫ్టి క్లోజింగ్‌కు ముందు 15,831ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 404 పాయింట్ల నష్టంతో 15,836 వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్‌ 1,416 పాయింట్లు క్షీణించింది. ఐటీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ షేర్లు మినహా మిగిలిన 48 నిఫ్టి షేర్లు నష్టంలో ముగిశాయి. నిఫ్టి టాప్‌ లూజర్స్‌గా నిలిచిన అయిదు షేర్లూ ఐటీ షేర్లే కావడం విశేషం. విప్రో, ఇన్ఫోసిస్, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. ఇక మిడ్‌ క్యాప్‌ ఐటీలోనూ రక్తపాతమే. మొన్నటిదాకా లాభాలు కురిపించిన ఈ షేర్లు ఇపుడు నష్టాల్లో రికార్డు సృష్టిస్తున్నాయి. ఎంఫసిస్‌ ఇవాళ ఏడు శాతంపైగా నష్టపోయింది. నిఫ్టి రెండున్నర శాతం నష్టపోతే… నిఫ్టి నెక్ట్స్‌ మూడు, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ 3.35 శాతం నష్టపోయింది. నిఫ్టి బ్యాంక్ 2.4 శాతంతో ముగిసింది. యూరో మార్కెట్లు రెండు శాతం వరకు నష్టంతో ఉన్నాయి. రాత్రి నాలుగు శాతంపైగా పడిన అమెరికా ఫ్యూచర్స్‌ ఇవాళ కూడా ఒక శాతంపైగా క్షీణించడంతో… మార్కెట్లో దిగువ స్థాయిలో కొనుగోళ్ళకు మన ఇన్వెస్టర్లు ఎవరూ సాహసించలేదు.