నిలబడిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్ల ఒత్తిడి నుంచి భారత్ ఇవాళ నిలదొక్కుకుంది. నాస్‌డాక్ 4 శాతం క్షీణించినా… డౌజోన్స్ 2 శాతం క్షీణించినా.. మార్కెట్ పట్టించుకోలేదు. నిఫ్టి ఇవాళ ఆరంభంలో నష్టాలతో ప్రారంభమైనా తరవాత కోలుకుంది. ఉదయం 22314 పాయింట్ల స్థాయిని తాకిన నిఫ్టి అక్కడి నుంచి కోలుకుని 22522 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. ముఖ్యంగా 1.30 నుంచి పూర్తిగా గ్రీన్‌లో కొనసాగింది. అయితే చివర్లో 22497 పాయింట్ల వద్ద అంటే 38 పాయింట్ల లాభంతో నిఫ్టి ముగిసింది. గత కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న ట్రెంట్ షేర్ ఇవాళ స్టార్ షేర్‌గా నిలిచింది. రూ. 4700 క్రితం ముగింపు నుంచి ఈ షేర్ ఏకంగా రూ. 5000 దాకా చేరింది. అయితే ఇవాళ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఏకంగా 27 శాతం నష్టంతో క్లోజ్ కావడం విశేషం. డెరివేటివ్స్ మార్కెట్‌లో ఈ బ్యాంక్ తాను పొందిన రూ. 1563 కోట్ల మార్కెట్ టు మార్కెట్ నష్టాలను దాచి పెట్టినట్లు తేలింది. దీంతో ఈ షేర్ 30 శాతం క్షీణించి రూ. 649ని తాకింది. అక్కడి నుంచి కోలుకుని 27 శాతం నష్టంతో రూ. 656 వద్ద ముగిసింది. ఈ షేర్ గత ఏడాది ఏప్రిల్ 8వ తేదీన రూ. 1576ని తాకింది.