మార్కెట్‌లో ఆ జోష్ ఏదీ?

ప్రపంచ మార్కెట్ల జోష్ ఇవాళ మన మార్కెట్‌లో కన్పించలేదు. కేవలం కంపెనీల ఫలితాలకు రియాక్ట్ కావడం వినా… మార్కెట్‌లో ఎక్కడా ఉత్సాహం కన్పించలేదు. పైగా ఎఫ్‌ఎంసీజీ వంటి కౌంటర్లలో ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. అలాగే ఫార్మాలోనూ యాక్షన్ లేదు. రాత్రి అమెరికా మార్కెట్ల లాభాలతో పోలిస్తే మన మార్కెట్లు నామమాత్రంగా పెరిగినట్లు. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ అని సర్ది చెప్పుకున్నా… అదీ కేవలం ఎంపిక చేసిన షేర్లకే. నిఫ్టి ఇవాళ ఉదయం 23,391 వద్దకు చేరినా.. అదే ఇవాళ్టి గరిష్ఠ స్థాయి అక్కడి నుంచి రోజంతా పతనమే. మిడ్‌సెషన్లో పెరిగినట్లు కన్పించినా… సరిగ్గా 2.15కు ఆ లాభాల్లో కూడా భారీ కోత పడింది. వెరశి నిఫ్టి ఇవాళ 98 పాయింట్ల లాభంతో 23311 వద్ద ముగిసింది. అంతకుమునుపు 23272 కనిష్ఠ స్థాయిని కూడా చూసింది. నిఫ్టిలో 33 షేర్లు లాభాల్లో క్లోజైనా…అది కార్పొరేట్ ఫలితాలకు స్పందనే. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ 8 శాతం దాకా లాభంలో క్లోజ్ కాగా, బీఈఎల్ 3.6 శాతం లాభం పొందింది. నిన్న ఒక్క రోజు ఒక మోస్తరుగా పెరిగిన ట్రెంట్ ఇవాళ మళ్ళీ నష్టాల్లో ముగిసింది. నిఫ్టి టాప్‌లూజర్ ఇదే.