18,800పైన ముగిసిన నిఫ్టి
బక్రీద్ పండుగ సందర్భంగా మార్కెట్లకు రేపు సెలవు ఉండేది. ఎల్లుండి జూన్ నెల కాంట్రాక్ట్‌లు ముగియాల్సి ఉండగా… స్టాక్ ఎక్స్ఛేంజీలు సెలవును ఎల్లుండికి వాయిదా వేశాయి. అంటే రేపు మార్కెట్లు పనిచేస్తాయి. అలాగే జూన్ నెల వారపు, నెలవారీ డెరివేటివ్స్ క్లోజింగ్ కూడా రేపే. దీంతో ఒక్కసారి మార్కెట్ మూడ్ మారిపోయింది. ఉదయం స్టాక్ ఎక్స్ఛేంజీల ప్రకటన రాకముందు 18714ని తాకిన నిఫ్టి.. ప్రకటన తరవాత కోలుకుంటూ౦ వచ్చింది. చివర్లో వచ్చిన షార్ట్ కవరింగ్ నిఫ్టి దిగువ స్థాయి నుంచి వంద పాయింట్లు కోలుకుంది. ఒకదశలో 18829ని తాకిన నిఫ్టి… 18817 వద్ద ముగిసింది. ముఖ్యంగా బ్యాంక్ షేర్ల నుంచి భారీ మద్దతు లభించింది. బ్యాంక్ షేర్లలో వచ్చిన షార్ట్ కవరింగ్‌తో నిఫ్టి బ్యాంక్ సూచీ ఒక శాతంపైగా లాభపడింది. మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో కూడా భారీ ర్యాలీ వచ్చింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 126 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ 446 పాయింట్ల లాభంతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు స్తబ్దుగా ఉన్నా.. మన మార్కెట్లు పెరగడానికి ప్రధాన కారణం.. డెరివేటివ్స్ క్లోజింగ్‌లో మార్పు. నిఫ్టిలో హెచ్డీఎఫ్సీ లైఫ్ టాప్ గెయినర్‌గా నిలిచింది. ఈ షేర్ 5.5 శాతం లాభపడింది. ఇక అపోలో హాస్పిటల్స్ 2 శాతం లాభంతో ముగిసింది. ఇక నష్టాల్లో సిప్లా ముందుంది. ఈ షేర్ ఒక శాతం నష్టంతో 1011 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టి షేర్లలో ఇండస్ ఇండ్ బ్యాంక్ తప్ప మిగిలిన షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎస్బీఐతో పాటు టాప్ ప్రైవేట్ బ్యాంకులన్నీ ఒకటి నుంచి రెండు శాతం దాకా లాభపడ్డాయి.