For Money

Business News

ఎన్డీటీవీ ఓపెన్ ఆఫర్‌: అదానీకి నిరాశ

ఎన్‌డీటీవీలో అద‌న‌ంగా 26 శాతం షేర్లను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ చేసిన ఓపెన్ ఆఫ‌ర్‌కు తొలి రోజు స్పంద‌న ల‌భించ‌లేదు. ఒక్కరూ కూడా తమ షేర్లను అమ్మడానికి ముందుకు రాలేదు. ఎన్డీటీవీ షేర్ ధ‌ర రూ.294 చొప్పున 1.67 కోట్ల షేర్లను కొనేందుకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫ‌ర్ ప్రకటించింది. ఎన్డీటీవీలో 26 శాతం అద‌న‌పు వాటాను సుమారు రూ.493 కోట్ల‌కు టేకోవ‌ర్ చేసేందుకు అదానీ గ్రూప్ ఈ ఓపెన్ ఆఫ‌ర్ ప్రతిపాదించింది. బీఎస్ఈలో నిన్న ఎన్డీటీవీ షేర్లు 1.56 శాతం నష్టంతో రూ.376.25 వ‌ద్ద ముగిశాయి. గ‌త గురువారం నుంచి బీఎస్ఈలో ఎన్డీటీవీ స్టాక్ 11.17 శాతం ప‌డిపోయింది. మంగ‌ళ‌వారం ముగింపు విలువ‌తో పోలిస్తే ఓపెన్ ఆఫ‌ర్ సుమారు 28 శాతం తక్కువ. ఎన్డీటీవీ షేర్‌ ఇదే ధర వద్ద కొనసాగే పక్షంలో ఓపెన్‌ ఆఫర్‌లో ఇన్వెస్టర్లు తమ షేర్లను అమ్మకపోవచ్చు. ఇదే జరిగితే ఎన్డీటీవీలో అదానీలు 30 శాతం వాటాతో కొనసాగాల్సి ఉంటుంది. నిన్న మీడియా షేర్లు లాభాల్లో ముగిశాయి. ఈ నేపథ్యంలో ఓపెన్‌ ఆఫర్‌కు మున్ముందు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.