IMPS ద్వారా ఇకపై రూ.5 లక్షల వరకు బదిలీ
ఆన్లైన్లో తక్షణ చెల్లింపు, బదిలీ సేవలకు ఉపయోగించే ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితిని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పెంచింది. ఇవాళ పరపతి విధానం ప్రకటిస్తూ … ప్రస్తుతం ఐఎంపీస్ ద్వారా బదిలీ చేస్తే గరిష్ఠ మొత్తాన్ని రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ గరవ్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. ‘‘ఐఎంపీఎస్ సేవల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులకు మరింత సౌలభ్యకరమైన సేవలను అందించేందుకు ఈ లావాదేవీలపై ఉన్న పరిమితిని రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు పెంచుతున్నాం’’ అని శక్తికాంత దాస్ అన్నారు. దీనిపై త్వరలోనే బ్యాంకులకు అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. 24 గంటలూ పనిచేసే ఈ సేవలను 2010లో ప్రారంభించారు. 2014 జవనరిలో ఐఎంపీఎస్ లావాదేవీల గరిష్ఠ పరిమితిని రూ.2లక్షలుగా నిర్ణయించారు. ఇపుడు ఈ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచారు.