For Money

Business News

ఈ డిజైర్‌ 31 కి.మీ. మైలేజీ ఇస్తుంది

దేశంలో నంబర్‌ వన్‌ ఆటోమొబైల్‌ కంపెనీ మారుతీ సుజుకీ ఎస్‌–సీఎన్‌జీ పరిజ్ఞానంతో కాంపాక్ట్‌ సెడాన్‌ డిజైర్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.8.14 లక్షల నుంచి ప్రారంభమౌతుందని కంపెనీ పేర్కొంది. 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో ఇంటెలిజెంట్‌ ఇంజెక్షన్‌ సిస్టమ్‌తో ఇవి రూపుదిద్దుకున్నాయని కంపెనీ తెలిపింది. మైలేజీ లీటరుకు 31.12 కిలోమీటర్లు అని వెల్లడించింది. నిర్వహణ వ్యయం తక్కువగా ఉండడం, అధిక మైలేజీ కారణంగా ఎస్‌–సీఎన్‌జీ వాహనాలకు డిమాండ్‌ బాగా పెరిగిందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. గడచిన అయిదేళ్ళలో కంపెనీ ఈ విభాగంలో ఏటా సగటున 19 శాతం వృద్ధి చెందిందని పేర్కొన్నారు. కొత్త డిజైర్ ఎస్‌-సీఎన్‌జీ సాంకేతికతతో, కే-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT 1.2L ఇంజన్‌ జతచేశారు. ఇది 57kW గరిష్ట శక్తిని, 98.5Nm గరిష్ట టార్క్‌ను అందించనుంది. ఫీచర్ల పరంగా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో పాటు ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్, డ్యుయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్, బ్రేక్ అసిస్ట్ లాంటి అనేక అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.