For Money

Business News

రూ.14 లక్షల కోట్లు తగ్గే…

అసలే బలహీనంగా ఉన్న మన మార్కెట్లపై వాల్‌స్ట్రీట్‌ గట్టి దెబ్బతీసింది. నిన్న శుక్రవారం వచ్చిన జాబ్‌ డేటా చాలా పాజిటివ్‌గా ఉండటంతో వాల్‌స్ట్రీట్‌ భారీ నష్టాల్లో ముగిసింది. దీనికి కారణం ఫెడరల్‌ రిజర్వు వడ్డీ తగ్గింపులో చాలా చురుగ్గా వ్యవహరించదని మార్కెట్‌ వర్గాలు భావించడమే. దీంతో ప్రధాన సూచీలు రెండు శాతం దాకా నష్టాలతో ముగిశాయి. అమెరికా ఫ్యూచర్స్‌ మరో ఒక శాతం నస్టంతో ట్రేడవుతుండటంతో మన మార్కెట్‌లో అమ్మకాలు జోరు కొనసాగింది. ఉదయం ఆరంభ నష్టాలను తగ్గించుకుని నిఫ్టి 24337 పాయింట్లను తాకింది. కాని అమెరికా ఫ్యూజర్స్‌ భారీ నష్టాల్లోకి జారుకునే సరికి నిఫ్టి క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. ఒక దశలో 23047 పాయింట్లకు క్షీణించిన నిఫ్టి…345 పాయింట్ల నష్టంతో 23085 పాయింట్ల వద్ద ముగిసింది. ఏ దశలో కూడా నిఫ్టికి మద్దతు లభించ లేదు. అమెరికా మార్కెట్ల ఫ్యూచర్‌ ట్రెండ్‌ చూసిన చాలా మంది ఇన్వెస్టర్లు తమ షార్ట్‌ పొజిషన్స్‌ను కొనసాగించేందుకే మొగ్గు చూపారు. దీంతో ఎక్కడా షార్ట్‌ కవరింగ్‌ రాలేదు. దీంతో నిఫ్టికి భారీ నష్టాలు తప్పలేదు. నిఫ్టిలో ఏకంగా 46 షేర్లు నష్టాలతో ముగిశాయి. నిఫ్టి గెయినర్స్‌లో టీసీఎస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హిందుస్థాన్‌ లీవర్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో అదానీ ఎంటర్‌ప్రైజస్‌ 6.2 శాతం నష్టంతో టాప్‌లో ఉంది. 5.4 శాతం నష్టంతో ట్రెంట్‌ రెండోస్థానంలో నిలిచింది. బీపీసీఎల్‌, బీఈఎల్‌, పవర్‌ గ్రిడ్‌ కంపెనీలు కూడా నాలుగు శాతంపైగా నష్టంతో ముగిశాయి. నిఫ్టి పతనంతో ఇవాళ బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.14 లక్షల కోట్ల మేర తగ్గింది.