మంత్రి గ్రూపు: రూ. 300 కోట్ల ఆస్తులు జప్తు
బెంగళూరుకు చెందిన మంత్రి గ్రూపునకు చెందిన రూ. 300.7 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది.‘మంత్రి సెరెనిటీ’ ‘మంత్రి వెబ్ సిటీ’ ‘మంత్రి ఎనర్జియా’ ప్రాజెక్టులను చేపట్టిన మంత్రి గ్రూప్ కొనుగోలుదారులను సేకరించిన మొత్తాన్ని ఇతర ప్రాజెక్టులకు తరలించి మోసం చేసిందని ఈడీ పేర్కొంది. మంత్రి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుబంధ సంస్థలైన కాజిల్స్ విస్టా ప్రైవేట్ లిమిటెడ్, బుయంట్ టెక్నాలజీ కాన్స్టేలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లు కొనుగోలుదారులను వివిధ రకాల పబ్లిసిటీతో మోసం చేసిపెద్ద ఎత్తున డిపాజిట్లు తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. ఏడు నుంచి పదేళ్లు గడిచినా ఫ్లాట్లను కొనుగోలుదారులకు డెలివరీ చేయలేదు. మంత్రి గ్రూపు సంస్థలపై కొనుగోలు దారుల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయి. సుబ్రహ్మణ్యపుర, కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించి మంత్రి డెవలపర్స్ ప్రైవేట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్స్ అండ్ డైరెక్టర్ సుశీల్ పీ మంత్రిని ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కేసు ఇంకా దర్యాప్తు జరుగుతోందని ఈడీ పేర్కొంది.