జగన్ అక్రమాస్తుల కేసుతో లింక్?
ఇటీవల ఏపీకి సంబంధించిన ఏ స్కామ్ కదిపినా.. మూలాలు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కన్పిస్తున్నాయి. అక్రమాస్తుల కేసు అటకెక్కడంతో అందులోని కీలక పాత్రధారులు చెలరేగిపోతున్నట్లు కన్పిస్తోంది. ఇవాళ ఢిల్లీ మద్యం స్కామ్‌లో జెట్ సెట్ గో ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన వివరాలను ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోరింది. ఈ కంపెనీ మద్యం కేసులో అరెస్టయిన అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి భార్య కనికా టేక్రివాల్ రెడ్డిదని తేలింది. ఈ కంపెనీలో ఆమెతో పాటు కరణ్ సింగ్, సుధీర్పేర్ల డైరెక్టర్లుగా ఉన్నారు. 2014లో ఏర్పాటైన ఈ కంపెనీ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. కాని ప్రధాన కార్యకలాపాలు మాత్రం హైదరాబాద్ నుంచి సాగిస్తోంది. ఈ కంపెనీకి ఉన్న ప్రధాన విమానాలన్నీ హైదరాబాద్ నుంచే తిరుగుతున్నాయి. ఇప్పటికే శరత్ చంద్రా రెడ్డికి చెందిన ట్రైడెంట్ కెన్ఫార్మా, అరవిందో కంపెనీలకు జగన్ అక్రమాస్తుల కేసులో పాత్ర ఉందని సీబీఐ, ఈడీలు తమ చార్జీషీటులో పేర్కొన్నాయి. ఇదే కేసులో మరో నిందితుడు అయిన పునీత్ దాల్మియా కూడా జెట్ సెట్ గోలో వాటాదారుడు కావడం విశేషం. దాల్మియా భారత్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన పునీత్ దాల్మియా తన వ్యక్తిగత హోదాలో ఈ పెట్టుబడి పెట్టిన ద మింట్ పత్రిక వెల్లడించింది. జెట్ సెట్ గో కంపెనీని 2014లో ఏర్పాటు చేయగా… 2015లో పునీత్ దాల్మియా పెట్టుబడి పెట్టారు. 2015 డిసెంబర్ 15న వచ్చిన ఈ వార్తలో దాల్మియా పెట్టుబడుల గురించి వివరించింది. జెట్‌సెట్‌గోలో తాను ఎంత పెట్టుబడి పెట్టింది పునీత్ దాల్మియా చెప్పలేదు. అయితే 20 మిలియన్ డాలర్లు పెట్టినట్లు తెలుస్తోందని ద మింట్ పత్రిక పేర్కొంది. అదే ఏడాది జులైలో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. కంపెనీ విస్తరణ కోసం ఈ నిధులను వెచ్చిస్తున్నట్లు అప్పట్లో కనికా టెక్రివాల్ రెడ్డి తెలిపారు.
అక్రమాస్తుల కేసు..
జెట్ సెట్ గోలో పెట్టుబడి పెట్టిన పునీత్ దాల్మియా క్విడ్ ప్రొ క్వొ కింద భారతీ సిమెంట్‌లో పెట్టుబడి పెట్టినట్లు సీబీఐ తన చార్జిషీట్లో పేర్కొంది. 2011 ఆగస్టులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పునీత్ దాల్మియా పాత్ర గురించి వివరించింది. ఈ కేసులో 13వ ముద్దాయిగా పునీత్ దాల్మియాను పేర్కొంది. అలాగే ఆ కంపెనీకి చెందిన మరో ముగ్గురిని కూడా నిందితులుగా పేర్కొంది. కడప జిల్లాలో అప్పటి ఈశ్వర్ సిమెంట్స్‌కు కేటాయించిన 407 హెక్టార్ల సున్నపురాయి గనులను 2008తో అక్రమంగా దాల్మియాకు అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కేటాయించినట్లు సీబీఐ ఆరోపించింది. 2009లో కడపలో దాల్మియా సిమెంట్స్ 25 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యం ఉన్న సిమెంట్ ప్లాంట్‌ను నెలకొల్పింది. సున్నపురాయి గనులు కేటాయించినందుకు క్విడ్ ప్రొ కింద భారతీ సిమెంట్స్‌లో రూ.50 కోట్లను దాల్మియా పెట్టుబడి పెట్టినట్లు సీబీఐ తెలిపింది. భారతీ సిమెంట్‌తో పాటు జగన్‌కు చెందిన ఇతర కంపెనీల్లో కూడా దాల్మియా పెట్టుబడి పెట్టినట్లు పేర్కొంది.
షేర్‌పై ప్రభావం
అరబింద్ ఫార్మా కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్న శరత్ చంద్రా రెడ్డి మద్యం కేసులో అరెస్ట్ కావడంతో ఆ కంపెనీ షేర్ భారీగా క్షీణించింది. ఇపుడు దాల్మియా భారత్ కూడా లిస్టెడ్ కంపెనీ. అయితే జెట్‌సెట్‌గోలో పునీత్ దాల్మియా తన వ్యక్తిగత హోదాలో పెట్టుబడి పెట్టినందున… ఈ కంపెనీ షేర్ రేపు ఎలా రియక్ట్ అవుతుందో చూడాలి. (పునీత్ దాల్మియా, యువరాజ్ సింగ్ తమ కంపెనీలో ఇన్వెస్టర్‌గా ఉన్నారని కనికా రెడ్డి 2022 సెప్టెంబర్ 2న గల్ఫ్ న్యూస్ పత్రికకు తెలిపారు.)