పది శాతం డౌన్…కొనొచ్చా?
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న లారస్ ల్యాబ్ స్టాక్ మార్కెట్లో ఇటీవలికాలంలో సంచలనం సృష్టించిన షేర్లలో ఒకటి. ముఖ్యంగా కరోనా సమయంలో ఈ షేర్ జెట్ స్పీడుతో దూసుకుపోయింది. కరోనా తరవాత కంపెనీ పనితీరులో చెప్పుకోదగ్గ ప్రగతి లేదు. దీంతో త్రైమాసిక ఫలితాలు వచ్చిన తరవాత కరెక్షన్కు గురవుతోంది. ఇటీవల రూ. 444ని తాకిన ఈ షేర్ మళ్ళీ కోలుకుని ఒక మోస్తరు లాభాలతో రాణిస్తోంది. కాని ఇవాళ ఈక్విటీ రీసెర్చి సంస్థ కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఇచ్చిన సెల్ రేటింగ్ కంపెనీ షేర్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఒకదశలో రూ.407ని తాకిన షేర్ క్లోజింగ్ ధర కూడా రూ. 408.5. కొటక్ ఇచ్చిన టార్గెట్ ధర రూ.350. దక్షిణాఫ్రికాలో కుదిరిన ఓ డీల్‌కు సంబంధించిన షరతులు మారాయని.. దీంతో కంపెనీ మార్జిన్ తగ్గుతుందని కొటక్ అంటోంది. దక్షిణాఫ్రికాకు సరఫరా చేసే యాంటి రెట్రో వైరల్ (ఏఆర్వీ) ధరను ప్రభుత్వం బాగా తగ్గించింది. అలాగే కరోనా సమయంలో కంపెనీకి కాసుల పంట పండించిన పాక్స్లోవిడ్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయని… దీనివల్ల కూడా కంపెనీ మార్జిన్స్ తగ్గుతాయని పేర్కొంది. అయితే పలు బ్రోకింగ్ సంస్థలు మాత్రం కంపెనీ పనితీరు బలహీనంగా ఉన్నా.. మరీ అంత బలహీనంగా ఉందని అంటున్నాయి. అమెరికా, యూరప్ మార్కెట్ల నుంచి కంపెనీ ఆదాయం సంతృప్తికరంగా ఉంటాయని పేర్కొంటున్నాయి. అయితే ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం చూస్తే కంపెనీ గరిష్ఠంగా రూ. 735, సగటు అంచనా రూ. 531గా తేలుతోంది. అంటే ప్రస్తుత ధర కన్నా 38 శాతంపైగా ఈ షేర్ ధర పెరిగే అవకాశముంది. ఈ షేర్‌ను ట్రాక్ చేస్తున్న 11 మంది అనలిస్టులతో ఎకనామిక్ టైమ్స్ సంప్రదించగా ఏడుగురు అనలిస్టలు కొనుగోలు చేయమని సలహా ఇస్తున్నారు. ముగ్గురు అమ్మాలని సిఫారసు చేస్తుండగా.. ఒక ఉన్న పొజిషన్స్‌ను కొనసాగించమని అంటున్నారు. కొటక్ నివేదికపై లారస్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు. ఒకవేళ కంపెనీ స్పందిస్తే… లారస్ షేర్‌ను ఇపుడు కొనాలా? వద్దా అని నిర్ణయించుకోవడం ఈజీ అవుతుంది.