పెట్టుబడుల కోసం కేటీఆర్ లండన్ టూర్
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లండన్ చేరుకున్నారు. యూరప్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆయన 10 రోజుల పాటు పర్యటిస్తారు. ఇవాళ్టి నుంచి 21 వరకు యునైటెడ్ కింగ్డమ్లో మంత్రి పర్యటిస్తారు. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూకేఐబీసీ) నిర్వహించే సమావేశాల్లో పాల్గొని వివిధ రంగాలకు చెందిన కంపెనీలతో పెట్టుబడులపై మంత్రి చర్చించనున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ రంగాలకు చెందిన పేరొందిన కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమవుతారు. అనంతరం 22 నుంచి 26 దాకా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్ధిక వేదిక (WEF) వార్షిక సమావేశాల్లో కేటీఆర్ పాల్గొంటారు. కొవిడ్ తర్వాత దావోస్ WEFలో మంత్రులు,అధికారులు వ్యక్తిగతంగా పాల్గొంటున్నారు. WEF సమావేశాలు జరిగే దావోస్‌లో ఇప్పటికే తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ తరపున ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకుగల అవకాశాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు, పెట్టుబడిదారులకు వివరించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.