కిమ్స్ చేతికి సన్‌షైన్ హాస్పిటల్స్
డాక్టర్ గురువారెడ్డికి చెందిన సన్‌షైన్ హాస్పిటల్స్‌ను కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) మెజారిటీ వాటా కొనుగోలు చేసింది. ఇటవల పబ్లిక్ ఇష్యూ ద్వారా భారీ ఎత్తున నిధుల సమీకరించిన కిమ్స్ హాస్పిటల్ సన్‌షైన్ హాస్పిటల్స్‌ను యజమాని అయిన సర్వేజన హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 51.07 శా తం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ మొత్తం వాటా విలువ రూ.362.78 కోట్లు. ఆర్థోపెడిక్ విభాగంలో కీలకంగా ఉన్న సన్‌షైన్ హాస్పిటల్స్‌ను సొంతం చేసుకోవడంతో తాము మరింత బలోపేతమవుతామని కిమ్స్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ రావు తెలిపారు. కిమ్స్ హాస్పిటల్స్‌తో చేరినందుకు ఆనందంగా ఉందని సన్‌షైన్ హాస్పిటల్స్ ఎండీ ఏవీ గురవా రెడ్డి తెలిపారు.
డీల్‌లో భాగంగా సన్‌షైన్ హాస్పిటల్స్ మొత్తం ఎంటర్‌ప్రైజ్ విలువను రూ.730 కోట్లుగా లెక్కగట్టారు. ప్రస్తుతం రెండు హాస్పిటల్స్‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 9 పట్టణాల్లో మొత్తం 12 ఆసుపత్రులు ఉన్నాయి. మోకాలి చిప్పల సర్జరీలో అంతర్జాతీయంగా పేరున్న గురవా రెడ్డి 2009లో సన్‌షైన్ హాస్పిటల్స్‌ను ప్రారంభించారు. స్వల్ప కాలంలోనే ఆగ్నేయాసియాలోనే రెండో అతిపెద్ద జాయింట్ రీప్లే్‌సమెంట్ కేంద్రంగా సన్‌షైన్ ఆవిర్భవించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను సన్‌షైన్ రూ.412 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. రూ.36 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.