లిస్టింగ్ లాభాలా… లాంగ్ టర్మ్ కోసమా?
రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన ఓ కంపెనీ 20 ఏళ్ళ తరవాత స్టాక్ మార్కెట్‌లో ఇవాళ అరంగేట్రం చేస్తోంది. జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు ఇవాళ ఉదయం పది గంటలకు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్ట్ కానున్నాయి. షేర్ జారీ దర రూ. 1,119 కాగా, కనీసం వంద నుంచి రెండు వందల రూపాయల లాభంతో ఇవాళ షేర్లు లిస్ట్ అవుతాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభం కానున్న నేపథ్యంలో చాలా మంది సాధారణ ఇన్వెస్టర్లు లిస్టింగ్ లాభాలకే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. అయితే రీటైల్ ఇన్వెస్టర్ల కంటే సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి ఈ ఇష్యూకు ఆదరణ లభించింది. వీరికి నిజంగా ఇష్యూపై నమ్మకం ఉంటే… ఇవాళ కొనుగోలు చేయాల్సి ఉంది. ఇదే జరిగితే అంటే సంస్థాగత ఇన్వెస్టర్లు కొంటే… ఇవాళ ఈ షేర్ కనీసం రూ. 250 లాభం పొందే ఛాన్స్ ఉంది. ఇవాళ మార్కెట్ నష్టాల్లో ఉన్నా… ఏఐ, చిప్, డేటా సెంటర్ల రంగానికి చెందిన షేర్లు లాభాల్లో ఉండే అవకాశముంది. ప్రపంచ వ్యాప్తంగా మళ్ళీ ఈ షేర్లలో ర్యాలీ కన్పిస్తోంది. జియో ప్లాట్‌ఫామ్స్ కూడా కేవలం మొబైల్ నెట్‌వర్క్ సర్వీస్ కంపెనీనే కాదని… తమ కంపెనీ భవిష్యత్తులో డేటా సెంటర్లతో పాటు శాటిలైట్ రంగంలో ప్రవేశిస్తుందని ప్రమోటర్లు ఇప్పటికే స్పష్టం చేశారు. దీన్ని న్యూఏజ్ రంగ కంపెనీగా పరిగణించాలని కొందరు అనలిస్టులు అంటున్నారు. మొబైల్ చార్జీలు పెంచితే తప్ప ఈ కంపెనీకి అదనంగా వచ్చే లాభాలు ఉండవని.. కాబట్టి కంపెనీ ఏఐ సంబంధిత రంగాలపై అధిక దృష్టి పెడుతుందని వీరి వాదన. అలాగే కొత్తతరం చేతికి కంపెనీ రావడంతో… కొత్త రంగాలపై జియో దృష్టి పెట్టే ఛాన్స్ ఉందని చాలా మంది భావిస్తున్నారు. రిలయన్స్, జియో ఫైనాన్స్‌కు భిన్నంగా ఈ కంపెనీ ఉంటుందని వీరి వాదన. ఈ షేర్‌పై ప్రముఖ బ్రోకింగ్ సంస్థ నొమురా కవరేజి ప్రారంభించింది. వాల్యూమ్ టు వ్యాల్యూ దిశగా జియో పయనిస్తుందని నొమురా అభిప్రాయపడింది. తనకు ఉన్న భారీ వ్యవస్థను మానిటైజేషన్ దిశగా జియో అడుగులు వేస్తుందని నొమురా అంటోంది. ఇకపై టెలికాంపై పెద్దగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉండదని, బ్రాండ్ బాండ్ సేవలను మరింత జోరుగా అందించే ఛాన్స్ ఉందని పేర్కొంది. పటిష్ఠమై నెట్‌వర్క్, కోట్ల మంది సబ్‌స్క్రయిబర్ల దృష్ట్యా… దీర్ఘకాలంలో వ్యాల్యూ క్రియేషన్ ఉంటుందని నొమురా వాదిస్తోంది. హోమ్ బ్రాడ్‌బాండ్ ద్వారా కూడా కంపెనీ భారీగా లాభాలు గడించే ఛాన్స్ ఉందని అంటోంది. లిస్టింగ్ ధరతో పోలిస్తే 20 శాతం అంటే రూ. 1340ని టార్గెట్‌గా నొమురా పేర్కొంది. మరో బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ కూడా ఈ షేర్‌కు బై రేటింగ్ ఇచ్చింది. ఈ సంస్థ కూడా రూ. 1350ని టార్గెట్‌గా పేర్కొంది.
