డిష్ టీవీ ఎండీగా జవహర్ గోయల్ ఔట్
డిష్ టీవీ ప్రమోటర్ అయిన జవహర్ గోయెల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా రాజీనామా చేశారు. ఎండీగా జవహర్ గోయెల్ వైదొలగినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర గోయెల్ కుమారుడే జవహర్ గోయల్. ఇవాళ జరిగిన డిష్ అసాధారణ సర్వ సభ్య సమావేశం (ఈజీఎం) జరగకుండా తీవ్రంగా ప్రయత్నించారు జవహర్ గోయల్. అయితే కోర్టుల నుంచి ఎలాంటి ఊరట లభించకపోవడంతో ఇవాళ ఈజీఎం జరిగింది. జవహర్ గోయల్‌ను మళ్ళీ ఎండీగా నియమించేందుకు ఉద్దేశించిన తీర్మానానికి అనుకూలంగా కేవలం 21.05 శాతం ఓట్లు రాగా, వ్యతిరేకంగా 78.95 శాతం ఓట్లు వచ్చాయి. అలాగే ఈయనతో పాటు డైరెక్టర్లు ప్రతిపాదించిన అనిల్ దువా, చక్రవర్తి వెంకటేష్ కూడా మళ్ళీ డైరెక్టర్లుగా ఎన్నిక అవలేదు. వీరిద్దరికి అనుకూలం 73 శాతం పైగా ఓట్లు పడ్డాయి. కాని తీర్మనానికి అనుకూలం 75 శాతం పడితేనే నెగ్గినట్లు. డిష్ టీవీ షేర్లను తాకట్టు పెట్టి ఓ ట్రస్ట్ ద్వారా జీ గ్రూప్ కంపెనీలు ఎస్ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్నాయి. ఇందులో నల్ల ధనం కేసులో ప్రముఖ పాత్ర వహించిన కంపెనీ పేరు కూడా ఉంది. తాము ఇచ్చిన రుణాలు వసూలు కాకపోవడంతో ఎస్ బ్యాంక్ సదరు షేర్లను జప్తు చేసుకుంది. దీంతో రుణాల స్థానంలో ఎస్ బ్యాంకుకు 24.19 శాతం వాటా దక్కింది. నల్లధనం కేసుతో సంబంధం ఉన్న కంపెనీ కాని, ఎస్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న కంపెనీలతో కాని తమకు సంబంధం లేదని జీ గ్రూప్ వాదించింది. అయితే కోర్టులువారి వాదనను కొట్టివేశాయి. ఇపుడు మెజారిటీ వాటాదారు అయిన ఎస్ బ్యాంక్ ఇవాళ్టి మీటింగ్‌లో జవహర్ గోయల్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా జవహర్ గోయల్ కంపెనీలో కొనసాగుతారు.