For Money

Business News

ఐటీసీ@ రూ.300.. ఇంకెంత పెరుగుతంది?

ఐటీసీ.. బ్లూచిప్‌ కంపెనీల్లో ఇన్వెస్టర్లను ఈ షేర్‌ విసిగించినంతగా మరో షేర్‌ విసిగించలేదేమో! పెద్ద కంపెనీ కావడం, డివిడెండ్‌ బాగా ఇచ్చే కంపెనీ కావడంతో ఈ కౌంటర్‌లో సంప్రదాయ ఇన్వెస్టర్లు ఎక్కువ. కాకపోతే.. కరోనా నేపథ్యంలో ఈ షేర్‌ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపింది. పనికి రాని చెత్త కంపెనీలు కూడా జెట్‌ స్పీడ్‌తో పెరుగుతుంటే ఈ షేర్‌ మాత్రం నిద్రపోయింది. దీనికి కారణంగా ఈ కంపెనీలోని ప్రధాన విభాగాలు కరోనా కారణంగా దెబ్బతినడం. ముఖ్యంగా హోటల్‌ విభాగం. అయితే కరోనా బూమ్‌ పూర్తవడం.. ఇతర షేర్ల ధరలు కరిగిపోతున్న సమయంలో ఐటీసీలో చలనం వచ్చింది. నిఫ్టి గత ఏడాది ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరిన తరవాత క్రమంగా పడుతూ వచ్చింది. నిఫ్టి పెద్దగా పడకపోయినా… ప్రధాన షేర్లు భారీగా క్షీణించాయి. ఈ షేర్‌ గత ఏడాది ఆగస్టు నెలలో 52 వారాల కనిష్ట స్థాయి రూ. 204కి పడిపోయింది. అక్టోబర్‌ తరవాత ఈ షేర్‌లో కదలిక ప్రారంభమైంది. ఇవాళ రూ.302.20ని తాకింది. క్లోజింగ్‌లో రూ. 299.45 వద్ద ముగిసింది. అంటే గడచిన ఆరు నెలల్లో ఐటీసీ షేర్‌ 40 శాతం దాకా పెరిగింది.
మరి ఇక్కడి నుంచి?
ఐటీసీ షేర్‌కు వెంటనే రూ. 320 ప్రాంతంలో గట్టి ప్రతిఘటన వస్తుందని పలువురు టెక్నికల్‌ అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పడినా రూ. 287 వద్ద చాలా గట్టి మద్దతు ఉందని అంటున్నారు. వాస్తవానికి ఈ షేర్‌ గనుక అక్కడికి చేరితే ఇన్వెస్టర్లకు కొనుగోలుకు మంచి ఛాన్స్‌ అని అంటున్నారు. రూ. 325 స్థాయిని దాటితే రూ. 345కు చేరడం ఖాయమని అంటున్నారు. ఐటీసీ షేర్‌ ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి రూ. 367. 2017లో ఈ స్థాయిని ఐటీసీ తాకింది. కీలక స్థాయిలను దాటే పక్షంలో ఈ గరిష్ఠ స్థాయిని కూడా దాటుతుందని కొందరు అనలిస్టులు అంటున్నారు.