For Money

Business News

రూ. 1,500 కోట్లకు పన్ను ఎగవేత

హైదరాబాద్‌లోని రాంకీ గ్రూప్‌పై ఈ నెల 6న ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడులకు సంబంధించి ఐటీ శాఖ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. అయితే అందులో కంపెనీ పేరు నేరుగా ప్రస్తావించకుండా స్థిరాస్తి, నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణ సంస్థకు చెందిన కార్యాలయాల్లో తాము సోదాలు నిర్వహించినట్లు ఐటీ విభాగం పేర్కొంది. సోదాల్లో అక్రమ లావాదేవీలకు సంబంధించిన భారీ ఎత్తున పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. 2018-19లో సింగపూర్‌లోని ఓ ప్రవాస సంస్థకు మెజారిటీ వాటాను విక్రయించి భారీ మూలధన లాభాన్ని కంపెనీ ఆర్జించినట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది.
ఈ సోదాల్లో దాదాపు రూ. 1,200 కోట్లకు సంబంధించిన పన్ను చెల్లింపులు ఎగ్గొట్టినట్లు ఐటీ విభాగం గుర్తించింది. లెక్కల్లోకి రాని మరో రూ. 300 కోట్లతో పాటు ఎగవేతకు పాల్పడిన పన్ను చెల్లించేందుకు సంస్థ అంగీకరించినట్లు ఆదాయపు పన్ను సంస్థ తెలిపింది.
అక్రమ లావాదేవీలు
పుస్తకాల్లో చూపని చాలా లావాదేవీలను రాంకీ గ్రూప్‌ నిర్వహించినట్లు ఐటీ దాడుల్లో బయటపడ్డాయి. క్యాపిటల్‌ గెయిన్స్‌ నుంచి తప్పించుకునేందుకు అనేక రంగాల అమ్మకాలు, కొనుగోళ్ళను కంపెనీ సృష్టింంచినట్లు తేలింది. క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ నుంచి తప్పించుకునేందుకు నష్టాలను చూపినట్లు, ఆ మేరకు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ విభాగం పేర్కొంది. తప్పుడు పద్ధతుల్లో రూ. 288 కోట్లను రాని బాకీల కింద చూపారని, సింగపూర్‌ కంపెనీ అమ్మకం ద్వారా వచ్చిన క్యాపిటల్‌ గెయిన్స్‌ నుంచి తప్పించుకునేందుకు ఈ పని చేసినట్లు ఐటీ విభాగం గుర్తించింది. ఇలా పన్ను చెల్లించాల్సిన దాదాపు రూ. 1,200 కోట్ల లావాదేవీలను ఐటీ విభాగం గుర్తించింది. లెక్కల్లో చూపని రూ. 300 కోట్లకు పన్ను చెల్లించేందుకు కంపెనీ అంగీకరించిందని, దర్యాప్తు కొనసాగుతోందని ఐటీ విభాగం తెలిపింది.