ఐపీఓ నిబంధనలు మరింత కఠినం
పబ్లిక్ ఇష్యూ నిధుల వినియోగానికి సంబంధించిన నిబంధనలను సెబీ మరింత కట్టుదిట్టం చేసింది. ఐపీఓ నిధులతో టేకోవర్ నిబంధనలను కఠినం చేసింది. పబ్లిక్ ఇష్యూ నిధుల్లో 25 శాతానికి మించి, ఆఫర్ డాక్యుమెంట్‌లో చెప్పని కంపెనీల కొనుగోళ్ల కోసం ఖర్చు చేయరాదు. అలాగే కంపెనీ సాధారణ అవసరాల కోసం వాడే నిధులు కూడా ఐపీఓ నిధుల్లో 10శాతానికి మించి ఖర్చు చేయకుండా ఆంక్షలు విధించింది. అలాగే పబ్లిక్ ఆఫర్‌లో ఇన్వెస్ట్ చేసే యాంకర్ ఇన్వెస్టర్ల అడ్డగోలు లాభాలకు చెక్ పెట్టేందుకూ సెబీ చర్యలు తీసుకుంది. ఇక నుంచి వీరు తమ పెట్టుబడుల్లో 50 శాతం మాత్రమే నెల రోజుల తర్వాత అమ్ముకునేందుకు అనుమతిస్తారు. మిగతా 50శాతం షేర్లను అమ్ముకునేందుకు 90 రోజుల వరకు ఆగాల్సిందే. ఇక ఐపీఓలో ఆఫర్-ఫర్-సేల్ (OFS)కు కూడా షరతులను నిర్దేశించింది. దీని ప్రకారం, ఐపిఓకు ముందు కంపెనీలో 20 శాతానికి పైగా వాటా ఉన్న వాటాదారులు తమ వాటాలలో 50 శాతం వరకు OFS లో విక్రయించడానికి అనుమతిస్తారు. ప్రారంభ వాటా విక్రయానికి ముందు ఒక సంస్థలో 20 శాతం కంటే తక్కువ వాటా ఉన్న పెట్టుబడిదారులు OFSలో తమ షేర్లలో 10 శాతం మాత్రమే అమ్మడానికి అనుమతిస్తారు. కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నాయి.