చైనా కంపెనీలకు డేటా లీక్ చేసిన పేటీఎం?
ఆర్బీఐ విధించిన ఆంక్షల కారణంగా పేటీఎం (మాతృ సంస్థ ONE 97 -COMMUNICATIONS LIMITED) కంపెనీ షేర్ 12 శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. అయితే ఆర్బీఐ ఎందుకు నిషేధం విధించింది? అన్న అంశంపై క్లారిటీ లేదు. అయితే తన కస్టమర్లకు చెందిన కీలక డేటాను చైనా కంపెనీలకు పేటీఎం లీక్ చేసిందని ఆర్బీఐ పరిశీలనలో బయటపడిందని… అందుకే ఆర్బీఐ చర్యలు తీసుకుందని మార్కెట్లో వదంతులు వస్తున్నాయి. డేటా లీక్ కారణంగా పేటీఎంపై భారత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునే అవకాశముందని బ్లూమ్బర్గ్ వార్త పేర్కొన్నట్లు జే బిజినెస్ న్యూస్ పేర్కొంది. డేటాను చైనా కంపెనీలకు లీక్ చేయడమంటే పెద్ద నేరమే అవుతుంది. పేటీఎంలో చైనా కంపెనీలకు వాటా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. పబ్లిక్ ఇష్యూ సమయంలో ఈ అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అయితే ఇపుడు చైనా కంపెనీల వాటా గురించి ఎవరూ ప్రశ్నించడం లేదని… కేవలం కీలక డేటాను చైనా కంపెనీలకు లీక్ చేసిందనే ఆరోపణలు చాలా తీవ్రమైనవని మార్కెట్ భావిస్తోంది. బ్లూమ్బర్గ్ వార్తా సంస్థ పేర్కొన్న అంశాలపై పేటీఎం ఇంకా స్పందించలేదు.