హైదరాబాద్‌లో రూ.2.5 కోట్ల నగదు పట్టివేత
హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ స్టేషన్ వద్ద వెస్ట్ జోన్ పోలీసులు రూ.2.5 కోట్ల నగదును పట్టుకున్నారు. హవాలా మార్గం ద్వారా ఈ నిధులను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరుకు చెందిన బొయాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మేనేజర్ అయిన బొచ్చు రాము నుంచి సుధీర్‌కుమార్ ఈశ్వర్‌లాల్ పటేల్, అశోక్ సింగ్‌లు రూ. 2,49,79,000 తీసుకున్నారు. టూ వీలర్‌పై ఈ మొత్తాన్ని బేగంబజార్‌లోని కోసల్వాడిలో ఉంటున్న లలిత్‌కు ఇచ్చేందుకు సుధీర్‌కుమార్, అశోక్ సింగ్ వెళుతుండగా.. విశ్వసనీయ సమాచారం అందడంతో జూబ్లి హిల్స్‌లోని భారతీయ విద్యా భవన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. లలిత్ ఆదేశాల మేరకు తాము జూబ్లిహిల్స్‌కు వచ్చి బొచ్చు రాము నుంచి క్యాష్ తీసుకున్నట్లు తెలిపారు. దీంతో బొచ్చు రామును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఢిల్లీలో ఉన్న తన స్నేహితుడు పోలా సత్యనారాయణ సూచనల మేరకు తాను ఓ వ్యక్తి నుంచి తీసుకున్నానని తెలిపాడు. 498847015 నంబర్ ఉన్న పది రూపాయల నోటు చూపించడంతో అతను ఈ క్యాష్ ఇచ్చినట్లు తెలిపాడు. అయితే ఈ నగదుకు సంబంధించిన వివరాలు ఇవ్వడంలో విఫలం కావడంతో వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బొచ్చు రాము, సుధీర్ కుమార్ ఈశ్వర్‌లాల్, అశోక్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హవాలా ఆపరేటర్ లలిత్ సింగ్, ఢిల్లీలో ఉన్న పోలా సత్యనారాయణ పరారీలో ఉన్నట్లు బంజారా హిల్స్ డివిజన్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ తెలిపారు. హవాలా కోసం వాడిన పది రూపాయల నోటు, రూ. 2,49,79,000 నగదు, రెండు సెల్ ఫోన్లు, ఒక సుజుకీ యాక్సిస్ ( AP 09 BS 9822)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వెనుక పెద్ద రాజకీయనేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.