థియేటర్ల షేర్లు బంపర్ హిట్
ముంబైతో పాటు పలు కీలక నగరాల్లో థియేటర్లు మళ్ళీ తెరచుకుంటున్నాయి. భారీ సినిమాల డేట్స్ విడుదల అవుతున్నాయి.ముందే పండుగ సీజన్… ఆపై ఏడాదిన్నర తరవాత సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్… వెరశి సినిమా ఎగ్జిబిటర్లు చాలా ఖుషీగా ఉన్నారు. ఇక మల్టిప్లెక్స్లన్నీ మళ్ళీ రెడీ అవుతున్నాయి. పరిస్థితి మునుపటికి వస్తుండటంతో మల్టీప్లెక్స్ ఆపరేటర్ల షేర్లకు మార్కెట్లో డిమాండ్ వస్తోంది. మల్టీప్లెక్స్ ఆపరేటర్లు పీవీఆర్, ఐనాక్స్ లీజర్ షేర్లు తమ 52 వారాల గరిష్టాలను తాకాయి. అక్టోబర్ 22 నుంచి మహారాష్ట్రలో సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు ప్రారంభం కానున్నాయి. ఐనాక్స్ లీజర్ 18 శాతం పుంజుకుని రూ.412.20 కి చేరింది. అంటే 52 వారాల గరిష్ట స్థాయి రూ.384.10ని దాటి కొత్త రికార్డు నెలకొల్పాయి. ఇక పీవీఆర్ షేర్ కూడా 10 శాతం పెరిగి రూ.1,662 కి చేరింది. ఈ షేర్ కూడా కొత్త గరిష్ట 1,631.85కి చేరడం విశేషం.