రూపాయి పతనం ఇంకెంత దూరం?
విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో చాలా చిత్రమైన పరిస్థితి నెలకొంది. డాలర్‌తో రూపాయి పతనం ఎంత దూరం? ఇంకెంత పడుతుంది? 82కు చేరుతుందా? అన్న ప్రశ్నలకు బ్రోకర్ల నుంచి ఎలాంటి సమాధానం లేదని సీఎన్‌బీసీ టీవీ 18 బ్యాంకింగ్ ఎడిటర్ లతా వెంకటేష్ అన్నారు. నిన్న బ్యాంక్ ఆఫ్ జపాన్ డాలర్లో చేసిన ట్రేడింగ్ కారణంగా అనూహ్యంగా నిన్న డాలర్ భారీగా పెరిగిందని… అయితే ఆర్బీఐ మాత్రం దూరంగా ఉందని ఆమె అన్నారు. కరెన్సీ మార్కెట్లో వస్తున్న అనూహ్య పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అన్న చర్చ మార్కెట్లో నడుస్తోందని.. అయితే మార్కెట్ ఏ స్థాయిలో స్థిరపడుతుందో చెప్పలేకపోతున్నారని ఆమె అన్నారు. ఫారెక్స్ మార్కెట్ డాలర్‌ను అమ్ముతూ వచ్చిన ఆర్బీఐ ఇపుడు కాస్త దూరంగా ఉంటోంది. ఏడాది ఆరంభంలో 0.5 శాతం ఉన్న వడ్డీ రేట్లు ఈ ఏడాది చివరికల్లా నాలుగు శాతం దాటడం ఖాయమని తేలడంతో… అనేక మంది విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికాకు మళ్ళిస్తున్నారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి ఇక ఎంత మాత్రం లాభదాయకం కాదని భారత్ నిర్ణయించింది. అంటే ఇపుడు పూర్తిగా డాలర్లలోనే క్రూడ్ కొనాల్సి ఉంటుందన్నమాట. క్రూడ్ తగ్గినట్లే కన్పిస్తున్నా.. 90 డాలర్లపైనే ఉంటోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు రెండేళ్ళ కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో ఆర్బీఐ రూపాయిగా అండగా నిలబడే అవకాశాలు తగ్గుతున్నాయి. దీన్ని ఛాన్స్‌గా తీసుకుని ఆపరేటర్లు చెలరేగి పోతున్నారు. డాలర్లు పొందే ఫార్మా, ఐటీ కంపెనీలు ఫారెక్స్ మార్కెట్లో భారీ లాభాన్ని ఆర్జిస్తున్నాయి. చాలా కంపెనీ డాలర్‌ను అమ్మడం లేదు. దీంతో మరింత కొరత ఏర్పడింది. చాలా రోజుల నుంచి డాలర్ పెరుగుతున్నా… రూపాయి నిలబడింది. దీంతో ఫార్మా, ఐటీ కంపెనీలకు పెద్ద ప్రయోజనం అందలేదు. ఇపుడు వచ్చిన అవకాశాన్ని ఈ కంపెనీలు వాడుకుంటున్నాయి. ఇలా డాలర్ అమ్మేవారు అమ్మడం లేదు.. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలతో డాలర్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఈ మధ్యలో రూపాయి ఇరుక్కుపోయింది. ఆర్బీఐ జోక్యం చేసుకోకపోతే రూపాయి 82ని క్రాస్ చేయడం పెద్ద కష్టం కాదని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి.