హిండెన్‌బర్గ్ రీసెర్చి మూసివేత..

ప్రముఖ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చి మూతపడింది. ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు నేట్ అండర్సన్ వెల్లడించారు. అయితే మూసివేతకు కారణాలు మాత్రం వెల్లడించలేదు. కంపెనీ మూసివేత గురించి గతేడాది చివరి నుంచి తన కుటుంబం, స్నేహితులతో తాను చర్చించినట్లు అండర్సన్ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఈ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ పెట్టుబడులు, రుణాలు, డెరివేటీవ్‌లను విశ్లేషిస్తుంది. ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ రీసెర్చి సేవలు కూడా అందించే ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా వివిధ కంపెనీల్లో అవకతవకలు, దుర్వినియోగం, రహస్య కార్యకలాపాలను విశ్లేషించి నివేదికలను విడుదల చేసింది. అలాగే షార్ట్‌సెల్లింగ్‌లో కూడా పెట్టుబడులు పెట్టింది. 2023లో భారత్‌కు చెందిన అదానీ గ్రూప్‌పై ఈ కంపెనీ చేసిన ఆరోపణలు స్టాక్ మార్కెట్‌లో కలకలం సృష్టించాయి. ఈ నివేదిక తరవాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి వచ్చింది. లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ తుడిచిపెట్టుకుపోయింది. అదానీకి సంబంధించిన హిండెన్ బర్గ్ రీసెర్చి చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని అమెరికా న్యాయస్థానాన్ని రిపబ్లికన్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఈనెల 20వ తేదీన ట్రంప్ పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో హిండెన్ బర్గ్ మూసివేయడం విచిత్రం.