బోగస్ ఖర్చుల వార్తలు ఊహాజనితం
తమ ఖాతా పుస్తకాల్లో రూ. 1,000 కోట్లకుపైగా బోగస్ ఖర్చుల్ని ఆదాయపు పన్ను శాఖ (ఐటీ శాఖ) కనుగొన్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు ఊహాజనితమేనని హీరో మోటోకార్ప్ తెలిపింది. హీరో మోటోకార్ప్ కార్యలయాలు, ఆ సంస్థ సీఎండీ పవన్ ముంజాల్ ఇళ్ళపై ఐటీ శాఖ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో లభించిన డాక్యుమెంట్లు, డిజిటల్ డాటా ద్వారా రూ.1,000 కోట్లకుపైగా నకిలీ నగదు వ్యయాలకు సంబంధించి అధికారులకు ఆధారాలు లభించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అధికార వర్గాలను పేర్కొంటూ ఏఎన్ఐ వార్తా సంస్థ వివరాలు వెల్లడించింది. అయితే ఈ వార్తలపై స్టాక్ ఎక్సేంజీలు కంపెనీని వివరణ కోరాయి. ఇందుకు హీరో మోటో బదులిస్తూ గతవారం తనిఖీకి వచ్చిన ఐటీ అధికారులకు అవసరమైన డాక్యుమెంట్లు, డాటాను ఇచ్చామని, ఇక ముందు సైతం అందచేస్తామని తెలిపింది. దీనికి సంబంధించి ఐటీ విభాగం ఏదైనా సమాచారం కంపెనీకి తెలియపరిస్తే, ఆ సమాచారాన్ని ఎక్సేంజీలకు ఇస్తామని కంపెనీ పేర్కొంది. హీరో గ్రూప్ రూ. 1,000 కోట్లకుపైగా నకిలీ నగదు ఖర్చులను చూపిందంటూ మీడియాలో వార్తలు రావడం వినా… ఇప్పటి వరకు ఐటీ విభాగం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.