బంగారం, వెండి ఢమాల్
అంతర్జాతీయ మార్కెట్లో బులియన్ ధరలు ఇవాళ గణనీయంగా క్షీణించాయి. ఇదే సమయంలో డాలర్ పెరగడంతో మన దేశంలో బంగారం, వెండి ధరలపై ఎఫెక్ట్ పడింది. అమెరికా మార్కెట్లో బంగారం ధర 2.28 శాతం, వెండి ధర దాదాపు మూడు శాతం క్షీణించింది. డాలర్ ఇండెక్స్ 0.65 శాతం పెరిగింది. స్పాట్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర ముంబైలో 52760 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48360 వద్ద ముగిసింది. అయితే ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధర భారీగా తగ్గింది. జూన్ నెల ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ స్టాండర్డ్ బంగారం ధర రూ. 1040 తగ్గి రూ.50661 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు రూ. 50,551ని తాకింది. రేపు ఉదయం స్పాట్ మార్కెట్లో బంగారం ధర భారీగా పడే అవకాశముంది. ఇక వెండి విషయానికొస్తే స్పాట్ మార్కెట్లో కిలో రూ. 61500 వద్ద ముగిసింది. అయితే ఫ్యూచర్స్ మార్కెట్లో కిలో వెండి జూన్ కాంట్రాక్ట్ రూ.1586 తగ్గి రూ. 60,343 వద్ద ట్రేడవుతోది. అంతక్రితం కిలో వెండి రూ. 59,702కు పడిపోయింది. రేపు స్పాట్ మార్కెట్లో వెండి ధర భారీగా తగ్గే అవకాశముంది. బులియన్ తగ్గడానికి ప్రధాన కారణంగా డాలర్ బలం కాగా, ఇన్వెస్టర్లు బాండ్లు, కరెన్సీలలో పెట్టుబడికి ఇష్టపడుతున్నారు.