For Money

Business News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం 9,576 కోట్లు

దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రకటించిన ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు కాస్త దూరంగా ఉన్నాయి. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను స్టాండ్‌అలోన్‌ నికర లాభం గత ఏడాదితో పోలిస్తే 21 శాతం పెరిగి రూ.9,579 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.9,159.99 కోట్లు. ఏడాది క్రితం నమోదైన నికర లాభం రూ.7,729.64 కోట్లతో పోలిస్తే 20 శాతం అధికం. మార్చితో ముగిసిన మూడు నెలల్లో నమోదైన రూ.10,055 కోట్లతో పోలిస్తే మాత్రం తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 14.5 శాతం పెరిగి రూ.17 వేల కోట్ల నుంచి రూ.19,481 కోట్లకు చేరింది.నికర వడ్డీ మార్జిన్‌ 4 శాతంగా ఉన్నట్లు బ్యాంక్‌ వెల్లడించింది. బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డు నిన్న సమావేశమై ఆర్థిక ఫలితాలను పరిగణనలోకి తీసుకుంది. బ్యాంక్‌కు ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం 35 శాతం పెరిగి రూ.7,699.99 కోట్లకు చేరింది. అలాగే ఈ త్రైమాసికంలో డిపాజిట్లు 19 శాతం అధికమయ్యాయి.
మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్‌ కేటాయింపులు రూ.4,830.84 కోట్ల నుంచి రూ.3,187. 73 కోట్లకు తగ్గాయి.
గత త్రైమాసికంలో కొత్తగా 36 శాఖలు ప్రారంభించగా, 10,932 మంది సిబ్బందిని కొత్త నియమించింది.. దీంతో మొత్తం శాఖల సంఖ్య 6 వేలకు చేరుకున్నాయని బ్యాంక్‌ తెలిపింది. కార్పొరేట్‌, హోల్‌సేల్‌ అడ్వాన్స్‌ రుణాల్లో వృద్ధి 15.7 శాతానికి పరిమితమవగా, రిటైల్‌ రుణాల్లో 21.7 శాతం, కమర్షియల్‌, గ్రామీణ బ్యాంకింగ్‌ రుణాల్లో 28.9 శాతం వృద్ధి నమోదు అయినట్లు బ్యాంక్‌ పేర్కొంది.