For Money

Business News

అమ్మకానికి నగర్నార్‌ స్టీల్‌ ప్లాంట్‌

చత్తీస్‌ఘడ్‌లోని జగదల్‌పూర్‌ వద్ద ఉన్న నగర్నార్‌ స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. జగదల్‌పూర్‌కు 16 కి.మీ.దూరంలో నగర్నార్‌ వద్ద ఈ ప్లాంట్‌ను రూ. 25,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. దేశంలో నెలకొల్పిన అత్యాధునిక స్టీల్‌ ప్లాంట్‌ ఇది. మరికొన్ని నెలల్లో ఈ ప్లాంట్‌ నిర్మాణం పూర్తి కానుంది. 2023లో హాట్‌ కాయిల్‌ యూనిట్‌ ఉత్పత్తి ప్రారంభించనుంది. ఇటీవలే ఈ కంపెనీని ఎన్‌ఎండీసీ నుంచి విడగొట్టారు. ఈ కంపెనీకి రూ. 1898 కోట్లతో అభివృద్ధి చేసిన నాలుగు ఇనుప ఖనిజ గనుల నుంచి ముడి పదార్థాలు సరఫరా అవుతాయి. నగర్నార్‌ స్టీల్‌ ప్లాంట్‌లో కేంద్రానికి 50.79 శాతం వాటా ఉండగా, ఎన్‌ఎండీసీకి పది శాతం వాటా ఉంది. కాబట్టి ఈ వేలంలో 60.79 శాతం వాటాను విక్రయించనున్నారు. ఆసక్తిగల కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్‌ను కేంద్రం ఆహ్వానించింది. బిడ్‌ చేసే కంపెనీకి కనీసం రూ.5000 కోట్ల నెట్‌వర్త్‌ ఉండాలి. ఒకే కంపెనీ లేదా కన్సార్టియంగా కూడా బిడ్‌ చేయొచ్చు. కన్సార్టియం గనుక బిడ్‌ చేస్తే.. అందులో గరిష్ఠంగా నాలుగు కంపెనీలు మాత్రమే ఉండాలి.. అందులో ఒక కంపెనీ లీడ్‌ మెంబర్‌గా ఉండాలి.