165 % పెరిగిన బంగారం దిగుమతులు
గత ఏడాది కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైనా…బంగారానికి డిమాండ్ బాగా పెరిగింది. గత ఏడాది నగల అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. 2020లో దేశీయంగా 446.4 టన్నుల బంగారానికి డిమాండ్ ఉండగా, 2021లో ఈ డిమాండ్ 797.3 టన్నులకు చేరింది. దేశీయ బంగారం డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా దిగుమతులతోనే సాధ్యమైతోందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. అందుకే డిమాండ్ పెరిగే కొద్దీ దిగుమతులు పెరుగుతాయని పేర్కొంది. 2020లో భారత్ విదేశాల నుంచి 349.5 టన్నుల బంగారం దిగుమతి చేసుకోగా 2021లో ఏకంగా 925 టన్నుల బంగారం దిగుమతి చేసుకున్నారు. అంటే ఏడాదిలో 165 శాతం పెరిగాయన్నమాట. 2011 తరవాత ఈ స్థాయిలో బంగారం దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారి అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. దాదాపు రెండేళ్ళ పాటు బంగారం వ్యాపారం చాలా డల్‌గా ఉందని, కాని గత ఏడాది చివరి త్రైమాసికంలో బంగారం డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని కౌన్సిల్ వెల్లడించింది. కేవలం ఈ మూడు నెలల్లోనే 343 టన్నులు బంగారానికి మార్కెట్లో డిమాండ్ వచ్చిందని కౌన్సిల్ పేర్కొంది.