For Money

Business News

యాపిల్‌ ఆదాయం… తగ్గేదే లే

బ్యాంకులు, ఐటీ కంపెనీలు, టెక్‌ కంపెనీలన్నీ ఈసారి నిరాశాజనక ఫలితాలు ప్రకటించాయి. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసానికి మంచి ఫలితాలు ప్రకటించిన కంపెనీలు కూడా తరువాతి త్రైమాసికంలో అంత సీన్‌ ఉండదని ముందే హెచ్చరించాయి. దీనికి ప్రధాన కారణంగా డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో భారీ హాలిడేస్‌ అమ్మకాలు ఉంటాయి కాబట్టి. కాని యాపిల్‌ కంపెనీ మాత్రం మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలకు మించి పనితీరు కనబర్చడమే గాకుండా… రానున్న త్రైమాసికంలో మరింత మంచి పనితీరు కనబరుస్తామని హామి ఇచ్చింది. 2021 చివరి త్రైమాసికంలో కంపెనీ 12,995 కోట్ల డాలర్ల ఆదాయం ప్రకటించింది. ఇందులో 7106 కోట్ల డాలర్ల ఆదాయం కేవలం ఐఫోన్‌ల అమ్మకం ద్వారానే వచ్చింది. ఒక త్రైమాసికంలో ఈ స్థాయి పనితీరు కనబర్చడం కంపెనీ చరిత్రలో మొదటిసారి. కంపెని నికర లాభం కూడా 3460 కోట్ల డాలర్లకు చేరింది. దీంతో ఒక్కో షేర్‌కు ఆదాయం 2.10 డాలర్లకు చేరడంతో షేర్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. ఐఫోన్ 13 ఫోన్లకు వినియోగదారుల నుంచి భారీ స్పందన లభించిందని కంపెనీ తెలిపింది. ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 13మిని, ఐఫోన్‌ 13 ప్రొ, ఐఫోన్‌ 13 ప్రొ మ్యాక్స్‌ మోడల్స్‌ ఫోన్ల అమ్మకాలు చాలా బాగున్నట్లు కంపెనీ తెలిపింది. మొత్తం ఐ ఫోన్‌ అమ్మకాల్లో ఈ మోడల్‌ అమ్మకాల గురించి చెప్పేందుకు కంపెనీ నిరాకరించింది. సర్వీసుల ద్వారా వచ్చే ఆదాయం రికార్డు స్థాయిలో 24 శాతం పెరిగి 1950 కోట్ల డాలర్లకు చేరింది. ఇక మ్యాక్ ద్వారా వచ్చే ఆదాయం కూడా రికార్డు స్థాయిలో పెరిగి 1085 కోట్ల డాలర్లకు పెరిగింది. ఐపాడ్‌ అమ్మకాలు 725 కోట్ల డాలర్లు కాగా, వేరబుల్స్‌, హోమ్‌, ఇతర యాక్ససరీల అమ్మకాల ద్వారా 1470 కోట్ల డాలర్ల ఆదాయాన్ని కంపెనీ ఆర్జించింది.