30న రాష్ట్రాలతో కేంద్రం భేటీ
మొన్నటి దాకా వరి ధాన్యం కొనుగోలుకు ససేమిరా అన్న కేంద్రం ఇపుడు రాష్ట్రాల వెంట పడుతోంది. ధాన్యం సేకరణ పెంచమని కోరుతోంది. ప్రస్తుత సీజన్లో 590 లక్షల టన్నుల బియ్యం సేకరించగా, సెప్టెంబర్ నెలాఖరుకల్లా ఇది 600 లక్షలకు చేరనుంది. ఇది గత ఏడాది లక్ష్యం కన్నా తక్కువ. అయితే ఈ ఖరీఫ్ సీజన్‌పై కేంద్రంలో టెన్షన్ పెరుగుతోంది. 2022-23 సీజన్లో వరి పంట విస్తీర్ణం 15 శాతంపైగా తగ్గింది. వరి పంట ప్రధానంగా పండించే రాష్ట్రాల్లో కరువు లాంటి పరిస్థితి నెలకొనడంతో కేంద్రం బియ్యం సేకరణను యుద్ధ ప్రాతిపదిక చేపట్టాలని భావిస్తోంది. ఎందుకంటే ఎఫ్ఐసీ కేవలం కనీస మద్దతు ధరకే కొంటోంది. అయితే వరి పంట దిగుబడి తగ్గుతోందని తెలిసిన తరవాత వ్యాపారస్థులు అధిక ధరకు వరి ధాన్యం కొంటున్నారు. అంటే ఎఫ్‌సీఐ సేకరణ కష్టంగా మారే అవకాశముంది. దీంతో బియ్యం సేకరణ టార్గెట్లను నిర్ణయించేందుకు ఈనెల 30వ తేదీన రాష్ట్రాలతో కేంద్రం భేటీ ఏర్పాటు చేసింది.
వర్షాల జాడ ఏది?
దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రంలో ఈసారి సాధారణ వర్షపాతం కన్నా 40 శాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో వరి పంట వేసినా..దిగుబడి వచ్చే వరకు టెన్షన్‌గా ఉంది. అలాగే వరి అధికంగా పండించే యూపీ, బీహార్, ఝార్ఖండ్లలోకూడా ఈసారి వర్షాలు సరిగా పడలేదు. ఈ రాష్ట్రాల్లో వర్షపాతం లోటు 30 శాతంపైనే ఉన్నట్లు తెలుస్తోంది. గోధమ ధరలు బహిరంగ మార్కెట్లో 30 శాతం దాకా పెరగ్గా, బియ్యం ధరలు 15 శాతం పెరిగాయి. ఎఫ్‌సీఐ వద్ద సాధారణంగా 400 లక్షల టన్నుల బియ్యం బఫర్ స్టాక్ ఉండాలి. కాని ఆగస్టు 1వ తేదీకి ఎఫ్‌సీఐ వద్ద 279 లక్షల టన్నుల బియ్యం స్టాక్ ఉంది. మరో 130 లక్షల టన్నుల బియ్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. ఇవన్నీ కలిపితే నిర్ణీత బఫర్ స్టాక్‌ను దాటుతుంది. అయితే 2022-23 మార్కెటింగ్ సీజన్ గురించి కేంద్రం భయపడుతోంది. ఎలాగైనా సరే బియ్యం సేకరణ లక్ష్యాన్ని మించేలా రాష్ట్రాలపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. ఈనెల 30న జరిగే సమావేశంలో ఆయా రాష్ట్రాల టార్గెట్‌ను కేంద్రం నిర్ణయించనుంది.